‘విపక్షాలకు చెంపపెట్టు’

16 May, 2019 - 5:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

గురువారం హైదరాబాద్‌లో ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ఇప్పటికైనా విపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం నిర్వాసితులను రెచ్చగొట్టడం మానుకోవాలంటూ విపక్షాలకు ఆయన హితవు పలికారు. తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని విపక్షాలు చూస్తున్నాయని విమర్శించారు. నిర్వాసితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు కరాఖండిగా తెగేసి చెప్పింది. గురువారం నిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టు విచారించి… పరిహారం తీసుకోవాలని వారికి సూచించింది. ఓ వేళ పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమవద్దకు రావాలని నిర్వాసితులకు హైకోర్టు స్పష్టం చేసింది.