మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ..!

10 November, 2019 - 9:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: మహారాష్ట్ర శాసనసభ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించినా.. తన వల్ల కాదంటూ బీజేపీ చేతులెత్తేసింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ తమకు లేదని, శివసేన కూడా సహకరించడంలేదని గవర్నర్ భగత్ సింగ్ కోశియారీకి బీజేపీ తెలియజేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత  ఉత్కంఠగా మారాయి.

అంతకు ముందు.. గవర్నర్ ఆహ్వానంపై బీజేపీ శాసనసభాపక్ష నేత, ఆపద్ధర్మ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సమావేశమై చర్చించారు. ఆదివారం సాయంత్రం వారు గవర్నర్‌ను కలిశారు. అనంతరం తమకు సంఖ్యాబలం తక్కువైనందున ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నామని పాటిల్ ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు గెలుచుకుని అదిపెద్ద పార్టీగా అవతరించింది.. కానీ.. మేజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది.  ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్‌ ఆహ్వానించారు. అయితే.. సోమవారంలోపు అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని గవర్నర్‌ గడవు విధించారు.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం బీజేపీకి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టలేమని భావించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని నిర్ణయించింది. సమావేశం అనంతరం ఫడ్నవీస్‌ శివసేనపై విమర్శల వర్షం కురిపించారు. ఠాక్రే  నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దమ్ము శివసేనకు ఉందా అంటూ సవాల్ విసిరారు. సరైన సంఖ్యాబలం ఉంటే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు.

చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ- శివసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకున్నారని, తమకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రజాభీష్టాన్ని కాదని కాంగ్రెస్, ఎన్సీపీతో ప్రభుత్వం ఏర్పాటు చేయలని శివసేన అనుకుంటోందని.. వారికి తమ శుభాకాంక్షలు అని చెప్పారు.

నిజానికి చెరో రెండున్నేరేళ్ళు చొప్పున సీఎం పీఠాన్ని పంచుకోవాలని ఫలితాలు వెల్లడైనప్పటి నుంచీ శివసేన పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్యా మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. తన ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపు తిప్పుకుంటుందో అనే అనుమానంతో శివసేన హొటల్లో క్యాంపు రాజకీయం నిర్వహిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే.. తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ వెనకడుగు వేయడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశియారీ ఆ తరువాతి స్థానంలో ఉన్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా తన నిర్ణయం చెప్పాలని కూడా శివసేన పార్టీని గవర్నర్ కోరారు. దీంతో శివసేన ఇప్పుడు 54 స్థానాలున్న ఎన్సీపీ, 44 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి దిగింది.