శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

14 February, 2020 - 5:58 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కర్నూలు: కర్నూలు జిల్లా శ్రీశైలంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను శుక్రవారం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయ దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులోభాగంగా గణపతి పూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ అఖండ దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి.. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

అలాగే శుక్రవారం 5 : 30 గంటలకు అంకురార్పణ అగ్నిప్రతిష్టాపన పూజలు అనంతరం రాత్రి 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ద్వజపట ఆవిష్కరణ బలిహరణలు మొదలైన  పూజలు జరుగుతాయని దేవస్థానం ఈవో కెఎస్ రామారావు వెల్లడించారు.

అలాగే ప్రతిరోజూ శివపార్వతులకు రుద్రహోమాలు నిత్యహోమాలు జరిపించటంతో పాటు ప్రత్యేక పూజలు అందుకునే ఆది దంపతులకు ప్రతిరోజూ సాయంత్రం వివిధ వాహన సేవలతో శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇక తెలంగాణలో అతి పెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం మహ శివరాత్రి జాతరకు ముస్తాబవుతోంది. ఈ నెల 20, 21, 22 తేదీలలో మూడు రోజుల పాటు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి యేటా రాజన్న సన్నిధిలో మహశివరాత్రి జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్న సంగతి తెలిసిందే. వేములవాడలో జరిగే మహశివరాత్రి జాతర కోసం తెలంగాణ నుంచే కాకుండా అంధ్రప్రదేశ్, మహరాష్ర్ట, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.