ఎస్ సర్, ఎస్‌ మేడమ్ వద్దు.. జై హింద్ అనండి!

13 September, 2017 - 1:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భోపాల్: దేశభక్తిని చాటేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. స్కూల్లో టీచర్ హాజరు తీసుకునేటప్పుడు ఎస్ మేడమ్, ఎస్ సర్ అని అనకూడదని.. జైహింద్ అనాలంటూ ఆరాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి విజయ్‌ షా ఆదేశాలు జారీ చేశారు. సాత్నా జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలకు తప్పనిసరి అని.. ప్రైవేట్ పాఠశాలలకు ఇది ఒక సలహా మాత్రమేనని మంత్రి విజయ్ షా చెప్పారు. ప్ర‌యోగాత్మకంగా ఈ విధానాన్ని మొద‌ట స‌త్నా జిల్లాలో అక్టోబ‌ర్ 1న‌ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ అనుమతితో అన్ని పాఠ‌శాల‌లో అమ‌లు చేసేందుకు చొర‌వ తీసుకోనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. `దేశ సంస్కృతి గురించి అవ‌గాహ‌న కోల్పోతున్న నేటి విద్యార్థుల్లో దేశాభిమానాన్ని పెంచ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్నామని.. జై హింద్‌` ప‌ల‌కడం అన్ని మ‌తాల వారికి స‌మంజ‌సంగా ఉంటుందని విజ‌య్ షా చెప్పారు.