ఓటరు చూపు… ఏ పార్టీ వైపు

10 March, 2020 - 7:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి గుత్తగా ఓట్లు గుద్దిన ఆంధ్రుడు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తన ఓటు ఏ పార్టీకి వేస్తాడనే విషయం ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. ఎందుకంటే.. నవరత్నాలు  అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలన ఇటీవలే నవ మసాలు పూర్తి చేసుకుంది. ఈ పాలనా కాలంలో ఇసుక కొరత, మద్యం ధరల పెంపు, పోలవరం ప్రాజెక్టు పనులు, రివర్స్ టెండరింగ్, 300 యూనిట్లు వాడితే  పెన్షన్ కట్…తదితర అంశాలన్ని సామాన్యుడిని అయోమయం జగన్నాథం అనే పరిస్థితిలోకి నెట్టాయి.

ఇక జగన్ ముఖ్యమంత్రిగా అమలు చేసినా.. చేస్తున్న పథకాల కంటే.. మూడు రాజధానుల అంశం.. రాష్ట్రంలో రాజకీయ వాతవరణాన్ని 100 డిగ్రీల ఫారన్ హీట్ వేడి పుట్టించిందంటే అతిశయోక్తి కాదేమో.అమరావతి ప్రాంతంలో రాజధాని గ్రామాల రైతులు చేపట్టిన ఆందోళనలు, ధర్నాలు శతదినోత్సవం చేరువకు చేరుకున్నాయి.

మూడు రాజధానుల అంశంపై అటు జగన్ ప్రభుత్వం కానీ ఇటు ఆ పార్టీ నేతలు కానీ తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. దాంతో జగన్ ప్రభుత్వంపై అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, ప్రజలు ఓ విధమైన కసితో రగిలిపోతున్నారు. ఇక మూడు రాజధానుల అంశం ఆంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కిందంటే రాజధాని అంశం ఆ ప్రాంత ప్రజల్లో ఏవిధంగా కాక పుట్టించిందో ఇట్టే అర్థం మవుతోంది.

మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని వివిధ రాజకీయ పార్టీలు పెట్టుకున్న పొత్తులు చెదిరిపోయాయి. తాజాగా కొత్త పొత్తులు విచ్చుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైయస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేశాయి. జనసేన మాత్రం వామపక్షాలతో కలిసి పొత్తు పెట్టుకున్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చే సరికి.. బీజేపీతో జనసేన జత కట్టింది. వామపక్షాలు ఈసారి టీడీపీతో కలవాలని చూస్తున్నారు. అందులోభాగంగా ఆ పార్టీ నేతలతో వామపక్ష నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇక అధికార వైయస్ఆర్సీపీ మాత్రం ఒంటరిగానే పోరుకు సిద్ధమవుతోంది.

అయితే మేలో జరుగుతాయని భావించిన స్థానిక సంస్థల ఎన్నికలు.. ముందే అంటే మార్చిలో జరగనుండడం కొంత వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే.. మార్చి, ఏప్రిల్… పరీక్షల సీజన్. దీంతో విద్యార్థులే కాదు వాళ్ల  తల్లిదండ్రులు సైతం టెన్షన్‌తో ఉంటారు. అయితే సీఎం జగన్ స్థానిక ఎన్నికలు మార్చిలో జరపాలని నిర్ణయించడం వెనక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రతికూలతను నివారించే ఉద్దేశ్యం దీని వెనుక ఉందంటున్నారు.

పరీక్షల హడావుడిలో పడ్డ జనం స్థానిక సంస్థల ఓట్ల గురించి అంతగా పట్టించునే అవకాశం ఉండదు. దీని వల్ల అధికారపార్టీకి వ్యతిరేక ఓట్లు తగ్గుతాయన్నది వైసీపీ ఎత్తుగడగా భావిస్తున్నారు. అందుకోసమే 10వ తరగతి పరీక్షల షెడ్యూలు మార్చి మరీ .. స్థానిక సంస్థల ఎన్నికల పరీక్షకు సీఎం జగన్ సిద్ధమయ్యారనే టాక్ అమరావతిలో జోరుగా వైరల్ అవుతోంది.

అదీకాక ఈ ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ చేసినట్లు అయితే అనర్హతతోపాటు జైలు శిక్ష పడేలా జగన్ ఆర్డినెన్స్ తీసుకురావడం కొసమెరుపు. ఈ ఆర్డినెన్స్‌ పై సైకిల్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ  గెలుపు కోసమే ఈ విధమైన ఆర్డినెన్స్ తీసుకు వచ్చారంటూ సైకిల్ పార్టీతోపాటు మిగిలిన రాజకీయ పక్షాల నేతలు సైతం సీఎం జగన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్సీపీ నేత కాకుండా.. ఇతర పార్టీల నేతలు విజయం సాధిస్తే.. మద్యం, నగదు పంచి గెలుపొందారంటూ మిగిలిన పార్టీల నేతలపై ఆరోపణలు గుప్పించి వారి పదవికి ఎసరు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆర్డినెన్స్ అని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఉగాది పండగ సందర్భంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామంటూ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అడపా దడపా ప్రకటిస్తునే ఉన్నారు. తీరా ఉగాది రానే వచ్చింది.

ఈ పండగ వేళ.. ఎన్నికల కోడ్ మూలంగా .. ఆ ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం అటకెక్కింది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఓ విధమైన నిరాశతో ఉన్నారు. ఇక ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం చేపట్టి  ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే.. ఫ్యాన్ పార్టీకి ఓట్లు గల్లంతయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని..  ఆ పార్టీలోని కీలక నేతలు ఇప్పటికే జగన్ వద్ద ప్రస్తావించారని సమాచారం. ఆ క్రమంలోనే ఉగాది సమయంలో ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఇళ్ల పట్టాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జగన్ భావించినట్లు తెలుస్తోంది. .

అలాగే అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఎన్నికలను వాయిదా వేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతిలో ఓటమి తథ్యమని తెలిసే ఫ్యాన్ పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వైయస్ జగన్ పాలన విమర్శలకు గురవుతున్న వేళ.. ఉత్తరాంధ్రా, కోస్తా, రాయలసీమలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని  ఆ పార్టీ నేతల్లోనే అంతర్గతంగా వైరల్ అవుతోంది.

అదీకాక మార్చి 12 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలు బంద్ అంటూ ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. దీంతో అధికార పార్టీకి తప్ప..  మిగిలిన పార్టీలకు మద్యం దొరకదనే సెటైర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏదీ ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు వైయస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తే.. మూడు రాజధానులకు ప్రజలు ఓకే అని తీర్పు ఇచ్చినట్లు అవుతుందని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రుడు ఏ పార్టీకి ఓటు గుద్దుతాడో.. తెలియాలంటే మాత్రం ఫలితాలు వచ్చేవరకు ఆగాల్సిందే.

  • జి.వి.వి.ఎన్. ప్రతాప్