కేసీఆర్‌గారు చంద్రమండలానికైనా ఎత్తిపోస్తానంటారు!

14 September, 2017 - 10:01 PM

‘‘శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవం’’ పేరిట సాగునీటి శాఖ మంత్రి హరీష్‌రావు ఆగస్టు 8న ఒక వ్యాసం వ్రాసారు. సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని సమగ్రంగా సరిదిద్దడం అనేది, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్థిర సాగునీటి పోకడలు, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు పెను ప్రమాదం తలపెట్టే గుదిబండ సాగునీటి విధానాలతో సాధ్యం కానే కాదు. సుస్థిర సాగునీటి విధానాలతో మాత్రమే అన్యాయాలను సరిదిద్దడం, బీళ్లకు నీళ్లివ్వడం వీలవుతుంది. అయితే రీ-డిజైనింగ్‌ పేరిట సుస్థిర సాగునీటి పద్ధతులను ఇప్పటికే కెసిఆర్‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది.

‘‘శ్రీరాంసాగర్‌ నిండింది లేదు, కాల్వ పారింది లేదు, పొలాలు పండిందీ లేదు. చూసుకుని మురుసుడు చెప్పుకొని ఏడ్సుడు.  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును సమైక్య రాష్ట్రంలో పాలకులు వట్టి పోయేలాగా చేసారు. ప్రాజెక్టు ఉండి కూడా లేనట్లే అయింది. ఎడారిలో ఒయాసిస్సు కావాల్సిన ప్రాజెక్టు ఎండమావిలా మిగిలింది. ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. ఆయకట్టు రైతుకు కన్నీళ్లే తప్ప ఏనాడూ సాగునీళ్లు ఇవ్వలేదు.’’… శ్రీరాంసాగర్‌ దుస్థితిపై హరీష్‌రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతో కీలకమైనవి. వీటిని నిశితంగా పరిశీలిద్దాం.

‘‘పునరుజ్జీవం నేపథ్యంలో శ్రీరాంసాగర్‌ వట్టిపోవడానికి, ఎండమావిలా మిగలడానికి, కన్నీళ్లు పెట్టించడానికి అసలు కారణం ఏమిటి? ఇందుకు కారకులెవరు?’’ ఇది చాలా కీలకమైన విషయం. సియం కెసిఆర్‌ అసెంబ్లీ జలదృశ్యంలో శ్రీరాంసాగర్‌ ఎగువన, మహారాష్ట్రలో గోదావరి, దాని ఉప-నదులపై అనేక వందల ప్రాజెక్టులు నిర్మించారని గూగుల్‌ ఉపగ్రహ చిత్రాలతో సహా ప్రత్యక్ష ప్రసారంతో చూపించారు. సుమారు 400 వరకు బ్యారేజీలు, ప్రాజెక్టులను నిర్మించారని కెసిఆర్‌ పేర్కొన్నారు. ఒక్కో బ్యారేజీలో 1-2 టియంసిలు, పెద్ద ప్రాజెక్టులో పదుల టియంసిల నీళ్లు నిల్వ చేశారన్నారు.

హరీష్‌రావు వ్యాసం రాసింది 10-8-2017 తేదీన. ఇక శ్రీరాంసాగర్‌ వట్టిపోవడానికి మహారాష్ట్ర నిర్మించిన ఒక్క గైక్వాడ్‌ ప్రాజెక్ట్‌ సామర్ధ్యం 108 టియంసిలు కాగా, 68 టియంసికు పైగా నీరు నిల్వ వుంది. ఈ సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని గోదావరి దాని ఉపనదులపై వున్న ప్రాజెక్టులన్నింటిలోనూ కలిపి ఒక్క గైక్వాడ్‌లో వున్నంత నీరు కూడా లేదు. మరి కెసిఆర్‌ జలదృశ్యంలో కళ్లకు కట్టేట్టు చూపించిన కొన్ని వందల మహారాష్ట్ర బ్యారేజీలు పాజెక్టు శ్రీరాంసాగర్‌ వట్టిపోవడానికి ఎండమావిలా మిగలడానికి కారణం కాదా? అలాంటప్పుడు నిజాలను మరుగుపరిచి, అబద్దాలను, అర్ధసత్యాలను ప్రచారం చేసి తెలంగాణ జనాన్ని ఎందుకు వంచిస్తున్నారు? ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఖమ్మం నల్గొండ జిల్లాల రైతాంగాన్నీ, భూమిని నమ్ముకున్న కుటుంబాలనీ ఎందుకు నిలువూనా మోసం చేస్తున్నారు?

సమైక్య పాలకులను నిందిస్తూ, మహారాష్ట్ర నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల విషయంలో స్పందించకుండా మీ కర్తవ్యం నుంచి తప్పించుకుంటారెందుకు? ‘‘వరద కాలువతో శ్రీరాంసాగర్‌కు ఎత్తిపోతలు తెలంగాణ చరిత్రలో గొప్ప మలుపు అంటారు హరీష్‌రావు. గొప్పది కాదు కదా, ఇది మామూలు మలుపు కూడా కాదు. నిజానికిది కేవలం కంటి తుడుపు, లాంఛనప్రాయమైన చర్య మాత్రమే. పైగా ఇది ప్రజలను మోసగించే అస్థిరమైన ప్రాజెక్టు. ఎగువ నుంచి దిగువకు వచ్చే గ్రావిటీ నీరే శ్రీరాంసాగర్‌ ఆయకట్టును రక్షించనప్పుడు, 350 కి.మీ దిగువ నుండి, 330 మీటర్ల ఎత్తుకు తరలించే 60 టియంసిలతో 16 లక్ష ఎకరాలకు- అదీ రెండు పంటలకు- నీళ్లు ఇస్తామంటే తెలంగాణ జనం ఈ కల్లబొల్లి మాటలు నమ్మాలా? తెలంగాణ జనం నమ్మడానికి సిద్ధంగావుంటే కెసిఆర్‌గారు చంద్రమండలానికైనా నీళ్లు ఎత్తిపోస్తానంటారు.

గోదావరి గర్భం గుండా మేడిగడ్డ (కాళేశ్వరం) నుండి శ్రీరాంసాగర్‌ వరకు వరుస బ్యారేజీలు నిర్మించాలన్న ప్రఖ్యాత ఇంజనీరు టి.హనుమంతరావు బహుళ ప్రయోజన పథకమే శ్రీరాంసాగర్‌ను పునరుజ్జీవనం చేసే నిజమైన సుస్థిరమైన పథకం. ఈ పథకాన్ని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సలహాదారు వదిరె శ్రీరాం కూడా తన ‘‘గోదావరి జలాల సమగ్ర వినియోగం అనే పుస్తకంలో పూర్తిగా సమర్ధించారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరికి టి.హనుమంతరావు పూర్తి ప్రణాళికతో సహా దీనిని వివరించారు. నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించిన లైన్‌ఎస్టిమేట్‌ కూడా నేటికీ తయారుచేసి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపలేదు. ఇవన్నీ చేస్తే, ఒకవేళ కేంద్రం ఆమోదిస్తే, కేంద్రమే నిధులు కూడా ఇస్తే వరుస బ్యారేజీల నియంత్రణ కేంద్రం చేతుల్లోకి వెళుతుంది. అలాగైతే కొత్త రాష్ట్రంలో, కొత్తగా అధికారంలోకి వచ్చిన తమ వ్యక్తిగత ప్రయోజనం ఎట్లా అనే ప్రధాన ప్రశ్న ఎదురైంది? దాని ఫలితమే ఈ డొంక తిరుగుడు అస్థిర ఎత్తిపోతలు.

కాళేశ్వరం నుండి వరద కాల్వ మీదుగా శ్రీరాంసాగర్‌కు ఎత్తిపోతలన్నది లాంచన ప్రాయమైనది. ఒక కంటి తుడుపు పథకం మాత్రమే. టి.హనుమంతరావు వరుస బ్యారేజీల పథకంతో పోలిస్తే ఇది ఏ పాటిదీ కాదు. కెసిఆర్‌ కూటమి ప్రచారం చేస్తునట్లు, పునరుజ్జీవమన్నది వాస్తవంలో లేదు. వుండనే వుండదు. ఎగువ నుంచి, గ్రావిటీ నీరు వచ్చినప్పుడే శ్రీరాంసాగర్‌ చివరి ఆయకట్టులోని అనేక ప్రాంతాకు నీరందలేదని హరీష్‌రావే అంటున్నారు. మరి మేడిగడ్డ నుండి ఎల్లంపెల్లి వరద కాల్వ మీదుగా శ్రీరాంసాగర్‌కు తరలించే 60 టియంసిల నీటితో 16 లక్ష ఎకరాలకు నీరందించడం సాధ్యమా? అయినప్పటికీ ఉత్తర తెలంగాణ, ఖమ్మం నల్గొండల పునరుజ్జీవం పేర నీళ్లిస్తామనే మమా అల్లుళ్ల మాయని, మాటలని తెలంగాణ సమాజం నమ్మాలని వారు కోరుకుంటున్నారు.

మేడిగడ్డ నుండి ఎత్తిపోసే 60 టియంసి నీటిలో ఆవిరి, ఇంకుడు నష్టాలుండవా? సహజంగా దిగువకు ప్రవహించే నీటిలో నష్టాల కంటే, ఎగువకు ఎంతో ఎత్తుకు ఎత్తిపోతలతో తరలించే నీటిలో ఆవిరి, ఇంకుడు నష్టాలు ఎక్కువగా వుంటాయి. వరద కాల్వ ద్వారా ఎగువకు తరలించే నీటిలో ఈ నష్టాలు మరింత ఎక్కువ. ఎక్కడైనా దిగువకు ప్రకృతి సిద్దంగా ప్రవహించే సహజ నీటికి శీతోష్ణస్థితి వాతావరణం అనువుగా వుంటుంది., అడుగు నేల నీరు ఇంకి ఇంకి భూగర్భ జలాలు ఎక్కువై, ఇక ఇంకడమన్నది పూర్తిగా ఆగి పోతుంది. నీరు పల్లమెరుగు అన్న సామెత అందరికీ తెలిసిందే. వరద కాలువ, దాని చుట్టు పరిసరాలు అసలు నీరు లేక ఎప్పుడూ తీవ్రదాహంతో వుండటం వల్ల ఇంకుడు, ఆవిరి నష్టాలెక్కువ. అదే గోదావరిలో ఇంకుడు నష్టాలు తక్కువ. నదీగర్భంలో నీరు ఇంకే వుంటుంది. మళ్లీ ఎప్పుడు ఏ చిన్న వర్షం వచ్చినా నదిలోకి రెండు వైపులా సహజంగా అనేక ఉపనదులు, వాగుల ద్వారా నీరు పుష్కలంగా వచ్చి చేరుతుంది. ఈ సహజ ప్రక్రియ మనిషి నిర్మించిన వరద కాలువల్లో అసలే వుండనందు వల్ల ఆ నీటినష్టాలు చాలా ఎక్కువ. నదులు, ఉపనదులను మనిషి సృష్టించడు. అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. నది దాని ఉప-నదులకు భారీ క్యాచ్‌మెంట్‌ (వర్షంవల్ల నీరు చేరే విశాల ప్రాంతం) వుంటుంది. నదిలోకి సహజంగా నీరు వస్తుంది. కానీ క్యాచ్‌మెంట్‌ నుండి వరద కాలువకు ఒక్క చుక్క కూడా రాదు. వరద కాల్వకు క్యాచ్‌మెంటూ వుండదు. ఉపనదులు కూడా వుండవు. పైగా వేల చ.కి.మీ విశాలమైన క్యాచ్‌మెంట్‌, అనేక ఉపనదులు కలువగా ఏర్పడిన ప్రధాన గోదావరి నది (శ్రీరాంసాగర్‌) నుంచి వరద కాలువ ఉద్భవించింది కాని, వరద కాలువ నుంచి గోదావరి ఉద్భవించలేదు. విశామైన విస్తారమైన క్యాచ్‌మెంట్‌ నుండి వచ్చిన ప్రతి నీటిబొట్టూ గోదా వరిపై ఎక్కడికక్కడ బ్యారేజీలు నిర్మించి నిల్వచేసి అక్కడి నుండే శ్రీరాంసాగర్‌కు ఎత్తిపోయవచ్చు. ఎక్కడి నీరు అక్కడ చేరే సహజ సిద్ధత వరద కాల్వలో లేదు.

కడెం ప్రాజెక్టుకు 1972-2012 వరకు 40 సం॥లో 1400 టియంసికు పైగా నీళ్లు వస్తే అందులో సగం కంటే ఎక్కువ- 800 టియంసి నీళ్లు- వృధాగా గోదావరి ద్వారా సముద్రానికే పోయాయి. ఇలాంటి అనేక ఉప-నదుల ద్వారా గోదావరిలో కిందికి పోయిన ప్రతి చుక్క నీటినీ కాళేశ్వరం దిగువ నుంచి శ్రీరాంసాగర్‌కు ఎత్తిపోస్తామంటే అది మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు. కడెం నదీ ముఖం నుండి గోదావరి గర్భం గుండా ఎగువ శ్రీరాంసాగర్‌ వరకు సుమారు 40 కి.మీ. దూరం వుండొచ్చు. ఇక్కడ ఒక బ్యారేజీ నిర్మించి ఈ నీళ్లను శ్రీరాంసాగర్‌కు తరలించడం మేలా? లేదా కేసీఆర్, హరీష్ రావు చెబుతున్నట్లు అవే కడెం నీళ్లు 200 కి.మీ. మేడిగడ్డ (కాళేశ్వరం) దిగువకు చేరిన తర్వాత అక్కడి నుండి శ్రీరాంసాగర్‌కు 350 కి.మీలు మళ్ళీ పైకి వరద కాలువ గుండా ఎత్తిపోయడం మేలా? ఏది మేలో తెలంగాణ ప్రజలే తేల్చాలి? కడెంలాంటి ఉపనదులు శ్రీరాంసాగర్‌ నుంచి కాళేశ్వరం వరకు ఇరువైపులా గోదావరిలో పదుల కొద్దీ ఉపనదులు వచ్చి కలుస్తాయి. ఈ నదుల నీళ్లన్నీ ఎక్కడిక్కడ బ్యారేజీలు నిర్మించి మొత్తం గోదావరి లోయ పొడవూతా దానిని జలాశయంగా మార్చి శ్రీరాంసాగర్‌కు చౌకగా నేరుగా ఎత్తిపోయడం రాష్ట్రానికి మేలా? లేక 350 కి.మీ. చుట్టు తిరిగి, 350 మీ శాశ్వతంగా ఎత్తిపోయడం మేలా? కేసీఆర్, హరీష్ రావు చెప్పాలి.

శ్రీరాంసాగర్‌ ఆయకట్టు ప్రాణహిత (తుమ్మిడిహెట్టి) ప్రాజెక్టులో భాగమని గత ప్రభుత్వాలు ప్రకటించాయి. కాని ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటి వరకు విడుదల చేయకుండానే, శ్రీరాంసాగర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమని హరీష్‌రావు వ్యాసంలో ప్రకటించేసారు. వరద కాలువను ‘‘జలాశయంగా’’మార్చుతామని హరీష్‌ వ్రాశారు. వరద కాలువ 122 కి.మీ మొత్తం పొడవులో ఒక టియంసి నీటిని నింపితే అది జలాశయంగా మారిపోతుంది. ఇదేమి పెద్ద విషయం కాదు. పైగా నీటి లెక్కల్లో, పరిమాణంలో చూసినప్పుడు 1 టియంసి అనేది అతి చిన్న విషయం. గోదావరిని జలాశయంగా మార్చితే 100 టియంసికు పైగా నీటిని నదిలోయ పొడవంతా నిలువ చేస్తూ బహుళ ప్రయోజనాలు నెరవేరేలా శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూర్‌కు నదీగర్భం గుండా కావసినంత నీటిని ఎత్తిపోయవచ్చు. అలాంటప్పుడు ఓ అతి చిన్న వరద కాలువ జలాశయం మేలా? ఒక్క ఎకరం భూసేకరణ, ఒక్క మనిషి నిర్వాసితుడు, ఒక్క పైసా పరిహారం లేకుండా, వరద కాలువతో పోలిస్తే, గోదావరిని బ్రహ్మాండమైన పొడవాటి ఏకశిలా జలాశయంగా మార్చడం మేలా?

2 మీ. వాగు లేని 50 టియంసిల కృత్రిమ జలాశయం మల్లన్న సాగర్‌ (సిద్దిపేట) కొరకు, 20 టియంసిల మీ కొండ పోచమ్మ (గజ్వేల్‌) కొరకు మేడిగడ్డ నుండి శ్రీపాద సాగర్‌ వరకు గోదావరిని పూర్తి జలాశయంగా మార్చుతారు గానీ కాలువల కోసం పైసా ఖర్ఛులేని ఉత్తర తెలంగాణ, ఖమ్మం,నల్గొండ జిల్లాల ప్రజల కొరకు ఎల్లంపెల్లి నుండి శ్రీరాంసాగర్‌ దాకా కేవలం మిగిలిన సగం గోదావరిని ఎందుకు ‘‘జలాశయంగా’’ మార్చరు?

మెదక్‌ మొత్తానికి కూడా కాదు, కేవలం సిద్దిపేట జిల్లాలోని మీ మామా అల్లుళ్ల  మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మలకో న్యాయం? ఉత్తర తెంగాణ, ఖమ్మం నల్గొండ ప్రజలకు ఒక న్యాయమా?

హైదరాబాద్‌కు దగ్గరున్న మీ మల్లన్నసాగర్‌ (557 మీ), కొండపోచమ్మ (624 మీ) కొరకు, నదిపరివాహక హక్కును ఉ్లంఘించి, మీ బేసిన్‌ కాని గోదావరి (వాస్తవంగా పెనుగంగ, ప్రాణహిత నీళ్లను) సగభాగాన్ని పూర్తి జలాశయంగా మార్చేస్తున్నారు. కానీ గోదావరిని ఆనుకొనే ఉన్న ఉత్తర తెలంగాణతో సహా ఇతర జిల్లాలు, గ్రావిటీతో నీరు వెళ్లే ఖమ్మం, నల్గొండ కొరకు, కేవలం సగం గోదావరిని జలాశయంగా మార్చకుండా తూతూ మంత్రం వరదకాలువ జలాశయం ఎత్తిపోతలు పెట్టడం పక్షపాతమూ వివక్షా కాదా?

మామా అల్లుళ్ల నియోజకవర్గాలలో నది కాదు కదా, 2 మీ. వాగు కూడా లేని మల్లన్న సాగర్, కొండ పోచమ్మ కృత్రిమ జలాశయాల నిర్మాణం కొరకు వేల ఎకరాల బలవంతపు భూసేకరణకు పూనుకున్నారు. ప్రభుత్వం అంచనా ప్రకారమే 80,500 కోట్లు పరిహాపం కింద ఖర్చు చేయడానికి పూనుకున్నారు. నిజానికిది నిపుణుల అంచనా ప్రకారం 1క్షా 80 వేల కోట్లవుతుంది. అంటే రెండు తెలంగాణ బడ్జెట్‌లంతన్నమాట.

సిద్దిపేట, గజ్వేల్‌ ప్రయోజనాల కొరకు సగం గోదావరిని జలాశయంగా మార్చారు సంతోషం. మా నీళ్లు మీరు తీసుకెెళ్లండి..ఫరవాలేదు. కాని ఒక్క ఎకరం భూసేకరణ అవసరం లేని, ఒక్క రైతుకు నయాపైసా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేని, రాష్ర ఖజానాపై భారం లేని, ప్రతి పైసా కేంద్రమే భరించే, ఉత్తర తెంగాణ, ఖమ్మం, నల్గండ జిల్లాకు ఎనలేని మేలు చేసే బహుళ ప్రయోజనాల గోదావరిని శ్రీరాంసాగర్‌ వరకు సం॥ పొడవునా నీళ్లుండే సంపూర్ణ జలాశయంగా ఎందుకు మార్చరు? మా నీళ్లు మాకు ఎందుకివ్వరు?

నాగర్జున సాగర్‌ వైష్ణవాలయమై వెలిగిపోతోంది… శ్రీరాంసాగర్‌ శివాలయమై కునారిల్లుతోంది… అని పునరుజ్జీవన సభలో కెసిఆర్‌ అన్నారు. నిజానికి నాగార్జునసాగర్‌ వైష్ణవాలయమై వెలిగి పోవడం లేదు, పైగా ఎడారిని తలపించే దారుణ దుస్థితిలో వుంది. సియం అన్నట్లు వాస్తవంగా శ్రీరాంసాగర్‌ శివాలయం కావడం వల్ల కునారిల్లిపోవడం లేదు. కృష్ణా గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు ఎక్కడికక్కడ వందల బ్యారేజీలు, ప్రాజెక్టులు కట్టడం ఒక కారణమైతే, కాలుష్యం కారణంగా వాతావరణంలో వచ్చిన పెను మార్పులు మరో ప్రధాన కారణం. ఇవి పట్టవా తెలంగాణ పాలకులకు?

కృష్ణా నదిపై భారీ ప్రాజెక్టు, బ్యారేజీ, చివరికి ఎత్తిపోతల కథ కూడా ముగిసింది. కృష్ణకు సంబంధించి  భారీ పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారు కాంట్రాక్టర్లకు, నాయకులకు, ఇంజనీర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టాడానికి సిద్దపడ్డవారేననుకోవాలి. అన్ని ప్రాజెక్టులు నిర్మించినా బీళ్లకు నీళ్లెందుకు రావో వారే చెప్పాలి. కృష్ణా పరివాహ బీళ్లకు నీళ్లందించే పథకం కేవలం టి.హనుంతరావు సుస్థిర ఫోర్‌వాటర్‌ కాన్సెప్ట్‌ మాత్రమే.

ఇక తెలంగాణకు మిగిలింది ప్రాణహిత, గోదావరి నదుల మాత్రమే. ఎగువ గోదావరిపై పెద్ద ఆశలేవు కాని కృష్ణా కంటే ఎంతో కొంత నయమే. గోదావరి ప్రాణహిత నదులపై మహారాష్ట్ర వలె ఎక్కడికక్కడ బ్యారేజీలు నిర్మించి, అదనంగా బహుళ ప్రయోజానాల కొరకు వాడుకోవడమే ఉత్తమమని నీటిపారుదల నిపుణు లందరూ చెప్పారు. నదికి ఇరువైపులా గ్రావిటీతో ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని సాధ్యమైన ప్రతిప్రాంతానికీ నీరివ్వాలి. ప్రాణహిత, గోదావరి నుంచి ఆర్ధికంగా ప్రయోజనం పొందే ప్రాంతం వరకు మాత్రమే నీళ్ళు తరలించడం తెలంగాణకు లాభదాయకమైనది. హనుమంతరావు పరిశోధన ప్రకారం తుమ్మిడిహెట్టి (148మీ) నుండి గోదావరి సుందిళ్ల (132మీ) వరకు నిర్మించే గ్రావిటీ కాలువే అత్యంత ప్రయోజనకరమైనది. ప్రాణహిత- సుందిళ్ల గోదావరి మధ్య  16 మీల వాలుంది. దీంతో తేలికగా ఏ ఎత్తిపోతలు లేకుండానే పారకంతోనే నీళ్లు గోదావరికి వస్తాయి. కాని కాళేశ్వరం (100 మీ) ఎల్లంపెల్లి (148మీ) మధ్య  48 మీ ఎగువకు నీళ్లు ఎత్తిపోయాల్సి వుంటుంది. కాని కాళేశ్వరం (100మీ) నుంచి కృష్ణా బేసిన్‌ దగ్గర కొండపోచమ్మ (624 మీ), తదితర ప్రాంతాల లక్షల ఎకరాలకు, ఆర్ధికంగా నిలబడని 20 ఎత్తిపోత ద్వారా నీళ్లిస్తామనడం రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను శాశ్వతంగా వినాశనం చేయడమే.

చంద్రమండలానికి నీళ్లు ఇస్తామనొచ్చు ఖర్చెంత? ప్రయోజనమెంత? అది సుస్థిరం కానట్లే, 100 మీ నుండి 650 మీ ఎత్తుకు ఎకరా ఒక పంటకి లక్ష రూ॥ ఖర్చుతో నీళ్లు తరలించడం ఎంత మాత్రమూ సుస్థిరం కాదు. అలాగే గోదావరి లోయ మార్గాన్ని వదిలిపెట్టి వరద కాలువ ద్వారా 350 కి.మీ చుట్టూ తిప్పుతూ 350 మీ ఎత్తిపోస్తే ఇంకి ఆవిరయ్యే ఆ కాసిన్ని నీళ్లు శ్రీరాంసాగర్‌ను పునరుజ్జీవనం చేయవు. హనుమంతరావు వరుస బ్యారేజీల పథకమే నిజమైన పునరుజ్జీవని.

  • – నైనాల గోవర్ధన్‌

    (తెలంగాణ జలసాధన సమితి) 
    మొబైల్ నంబర్ 9701381799