టికెట్ డబ్బుల బదులు పిడిగుద్దులు

28 September, 2017 - 10:36 AM

(న్యూవేవ్స్ డెస్క్)

మహబూబ్ నగర్ : ఆర్టీసీ బస్సులో ఓ మహిళా కానిస్టేబుల్, మహిళా కండక్టర్ ఘర్షణకు దిగారు. టికెట్ అడిగినందుకు కానిస్టేబుల్‌ కండక్టర్‌పై పిడి గుద్దులు కురిపించింది. ఈ ఘటనను బస్సులో ఉన్న ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

మహబూబ్‌ నగర్‌ నుంచి బుధవారం నవాబుపేటకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ రజితకుమారి ఎక్కారు. బస్సు బోయపల్లి గేట్‌ దాటిన తరువాత టికెట్లిస్తూ కండక్టర్ శోభారాణి ఆ కానిస్టేబుల్ ను టికెట్ అడిగారు. దానికి ఆమె తనవద్దనున్న జిరాక్స్‌ ఐడీ కార్డు చూపించారు. అయితే అది ఒరిజనల్ కాదని, దానిని పరిగణనలోకి తీసుకోమని, పోనీ వారెంట్ ఉంటే చూపించాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణకు దారితీసింది. కానిస్టేబుల్ తన చేతిపవర్ రుచి చూపించగా, కండక్టర్ సీట్లో పడిపోయారు. అయితే కానిస్టేబుల్‌పై నవాబుపేట పోలీసులు చర్య తీసుకోలేదు. పోలీస్‌స్టేషన్‌లోనే ఇద్దరి మధ్యా రాజీ చేశారు.