మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కన్నబాబు

22 June, 2019 - 5:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కురసాల కన్నబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. రైతు భరోసా పథకం అమలు దస్త్రంపై మంత్రి కన్నబాబు తొలి సంతకం చేశారు. రైతులను ఆదుకునేందుకు రైతు బీమా పథకం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ధరల స్థిరీకరణ నిధిని రూ. 3 వేల కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కన్నబాబు ఈ సందర్భంగా చెప్పారు. అలాగే సహకార సొసైటీల ఆధునీకరణ కోసం రూ. 120 కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చలామణి అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. వాటిని తక్షణమే అరికట్టి.. నకిలి విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కన్నబాబు వివరించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కన్నబాబు ఎమ్మెల్యేగా ఎన్నికై .. వైయస్ జగన్ కేబినెట్‌లో స్థానం సంపాదించారు. కృష్ణా జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా కన్నబాబుని ప్రభుత్వం నియమించింది.