పవన్ సినిమాకి కథ సిద్ధం!

14 October, 2019 - 2:55 PM

(న్యూవేవ్స్ డెస్క్)
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు రంగం సిద్ధమైందని.. పవన్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో, ఏఎం రత్నం దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంస్థలో నటించనున్నారంటూ సోషల్ మీడియా సాక్షిగా తెగ వైరల్ అవుతోంది. అయితే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ టాక్ హోరెత్తి పోతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఇటీవల దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) కలసి ఓ స్టోరీ లైన్ వినిపించారట. ఆ స్టోరీ లైనుకి పవన్ ఫిదా అయిపోయారట. అందుకు కథను సిద్ధం చేస్తే.. తాను నటించేందుకు సిద్ధమని క్రిష్‌కి పవన్ కళ్యాణ్ హామీ కూడా ఇచ్చేశారట. దాంతో క్రిష్.. కథకు సంబంధించిన స్క్రీప్ట్‌ ను సిద్ధం చేశారట.
దీంతో పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో ఓ చిత్రం వచ్చేఏడాది తెరకెక్కనుందంటూ సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్.. రెండు చిత్రాల్లో నటించనున్నారని… వాటిలో ఒకటి క్రిష్ దర్శకత్వంలో అనే టాక్ కూడా నడుస్తోంది. కానీ అటు క్రిష్ నుంచి కానీ.. లేక ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడవలపి ఉంది.
అయితే ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా కథానాయకుడు, మహానాయకుడు టైటిల్స్ ‌తో చిత్రాలు తెరకెక్కాయి. కానీ ఆ రెండు చిత్రాలు  ఘోరంగా పరాజయం పొందిన సంగతి తెలిసిందే.