కథ ముగిసినట్లే..

26 May, 2019 - 5:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నల్గొండ: టీపీసీసీ చీఫ్ రేసులో తాను లేనని భువనగరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… నల్గోండలో చెల్లని రూపాయి… భువనగిరిలో చెల్లిందంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి వెంకట్‌రెడ్డి చురకలంటించారు. సొంత బిడ్డని గెలిపించుకోలేని సీఎం కేసీఆర్ మమ్మల్ని ఏమని విమర్శిస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కథ ముగిసినట్లే అని కోమటిరెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తమ రాజకీయ భవిష్యత్తు కంటే తెలంగాణ భవిష్యత్తు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. త్వరలో గెలిచిన ఎంపీలంతా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఏపీకి వైయస్ జగన్ సీఎం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఐదేళ్లు వైఎస్ జగన్ జనంలో ఉండటం వల్లే ఎన్నికల్లో గెలిచారని ఆయన అభిప్రాయ పడ్డారు. తెలంగాణలో తాము అలా చేయలేకపోయామని తెలిపారు. వచ్చే నాలుగేళ్లు ఇక జనంలోనే ఉంటామని ఆయన స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో 100 మున్సిపాల్టీలను గెలుచుకోవడమే తమ లక్ష్యం అని తెలిపారు.

ఇటీవల జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ మూడింటిని భువనగిరి, నల్గొండ, మల్కాజ్‌గిరి స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపూరీ అరవింద్.. ప్రత్యర్థి కవితపై గెలుపొందారు. అలాగే బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచి తన సత్తాను చాటింది. దీంతో ఈ లోక్‌సభ ఫలితాలు పట్ల సీఎం కేసీఆర్.. కొంత అసహనం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.