నల్గొండ ఎంపీ బరిలో వెంకట్‌రెడ్డి!

13 February, 2018 - 2:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నల్గొండ: ఈసారి జరిగే సాధారణ ఎన్నికల్లో తాను నల్గొండ ఎంపీ స్థానం నుంచే పోటీ చేస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి ఓ బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీశ్‌‌రెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదని ఆయన జోస్యం చెప్పారు.

నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను గెలిపించుకోడానికే తాను ఎంపీగా పోటీ చేయనున్నట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇటీవల హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సతీమణి, నల్గొండ మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌ లక్ష్మికి ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని గుత్తా సుఖేందర్‌‌రెడ్డి పార్టీ టికెట్‌ మీద పోటీ చేస్తేనే గత ఎన్నికల్లో 2 లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చిందని, ఈసారి తనకు అంతకు మించి వస్తుందని అన్నారు.