ఆర్మీక్యాప్‌లతో బరిలోకి కోహ్లీ సేన!

08 March, 2019 - 2:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

రాంచీ: పుల్వామా ఆత్మాహుతి దాడిలో అసువులు బాసిన సీఆర్పీఎఫ్ వీరజవాన్లకు టీమిండియా ఆటగాళ్ళు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్ళంతా తలపై ఆర్మీ క్యాప్‌లు ధరించి మైదానంలో అడుగుపెట్టారు. అంతే కాకుండా రాంచీలో ఆస్ట్రేలియాతో శుక్రవారం జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తమకు వచ్చే ఫీజును అమర జవానల్ కుటుంబాలకు విరాళంగా అందజేయాలని నిర్ణయించారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జైషే ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

కాగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సీరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీలో జరుగుతున్న మూడో వన్డేకి టీమిండియా టాస్‌ గెలిచి, ముందుగా ఫీల్డింగ్‌ చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. దేశ రక్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏం చేసినా రుణం తీర్చుకోలేం. ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి. మూడో వన్డేలో మాకు వచ్చే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తాం. దేశం కోసం ప్రతి ఒక్కరూ వారికి చేతనైన సేవ చేయాలని కోరుతున్నా. జవాన్ల కుటుంబాలకు మనం మద్దతుగా నిలవాలి. మనం వారి వెంట ఉన్నామన్న ధైర్యం ఇవ్వాలి. వీరజవాన్లు, వారి కుటుంబాలు దేశానికి చేసిన సేవకు చిహ్నంగా ఈ మ్యాచ్‌‌లో ఆర్మీక్యాప్‌‌లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు’ అని పేర్కొన్నాడు.ఈ మ్యాచ్‌‌కు ముందు.. ఈ టోపీలను టీమిండియా మాజీ సారథి, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోని ఆటగాళ్లందరికీ అందజేశాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజును నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌ ద్వారా అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ఉపయోగిస్తామని ప్రకటించింది.
ఈ సీరీస్‌లో భాగంగా రెండు వన్డేలు గెలిచి మంచి ఫామ్‌‌లో ఉన్న కోహ్లీసేన ఈ మ్యాచ్‌ కూడా గెలిచి సీరీస్‌ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచి సీరీస్‌ పోరులో నిలవాలని ఆసీస్‌ భావిస్తోంది.

తుదిజట్లు:
భారత్‌: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, విజయ్‌ శంకర్, జాదవ్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్, బుమ్రా, షమీ.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), ఖాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌ కోంబ్, మ్యాక్స్‌‌వెల్, స్టొయినిస్, కారీ, కమిన్స్, లయన్, జంపా, రిచర్డ్సన్‌.