నిరంకుశ పాలనకు గోరీ కట్టండి

04 December, 2018 - 5:25 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

వరంగల్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ నిరంకుశ పాలనకు గోరీ కట్టాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయం గవర్నర్‌‌కు ముందే చెప్పామని ఆయన వెల్లడించారు. ఏడవ తేదీన జరిగే పోలింగ్‌లో ప్రజాకూటమికి పట్టంకట్టాలని కోదండరామ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండలోని టీజేఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడయా సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌‌రెడ్డిని తెల్లవారుజామున అరెస్ట్‌ చేయడాన్ని కోదండరామ్ తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్‌ చేయడం దుర్మార్గం అన్నారు. ప్రజాకూటమి అభ్యర్థులపై కావాలనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అధికార పార్టీకి కొమ్ముకాయకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.

రాత్రి జరిగిన అరెస్ట్‌‌లు టీఆర్ఎస్‌ అసహనానికి నిదర్శనమని కోదండరామ్‌ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాప్‌రెడ్డి విషయంలో కూడా ఇలాగే చేశారని కోదండరామ్ గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ తీరు ఇలాగే ఉండబోతోందని ఎన్నికల సంఘానికి తాము ముందే తెలియజేశామన్నారు. రాష్ట్రంలో బయోత్పాతం సృష్టిస్తారని ముందే ఊహించామని, ఇప్పుడదే జరుగుతోందని తెలిపారు. ఎమర్జెన్సీలో లేని ఉల్లంఘనలు ఇప్పుడు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదండరామ్ సూచించారు.

వరంగల్‌ పశ్చిమ, వర్దన్నపేట ప్రజాకూటమి అభ్యర్థులు రేవూరి ప్రకాష్‌ రెడ్డి, దేవయ్యలకు భారీ సంఖ్యలో ఓట్లు వేయాలని ప్రజలను కోదండరామ్ కోరారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేశామని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రజల అభివృద్ధి కనపడటం లేదని ఎద్దేవా చేశారు. కౌలు రైతులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివక్ష చూపిందని, ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామని కోదండరామ్ హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రజాకూటమి చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులను సమీక్షిస్తామని స్పష్టం చేశారు.