అప్పుడు పొడిచావు.. ఇప్పుడు తెలుసుకోవాలంటావు

11 January, 2019 - 2:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన చూసి సీఎం చంద్రబాబు లేఖల పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు.

పాత ఆరోపణలను కొత్తగా ప్రచారం చేయాలని చూస్తే.. ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబును కొడాలి నాని హెచ్చరించారు. శుక్రవారం విజయవాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ… చంద్రబాబుని మించిన అవినీతి పరుడు, నమ్మక ద్రోహి మరొకరు ఉండరని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేర్కొన్న మాటలను ప్రజలు ఇప్పటికి మరిచి పోలేదన్నారు.

చంద్రబాబు .. వైయస్ఆర్ సీపీ నుంచి కొనుక్కున్న గొర్రెలతో వైయస్ జగన్‌కి ఓ లేఖ రాయించాడని తెలిపారు. ఆ లేఖ రాసింది చంద్రబాబు అయితే.. ఆ లేఖపై సంతకాలు చేసింది మాత్రం అమ్ముడు పోయిన 23 మంది గొర్రెలు అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కాగా సదరు ఈ లేఖలో కొత్తగా రాసిన ఆరోపణలు కానీ, పదాలు కానీ, విమర్శలు కానీ లేవన్నారు.

వైయస్ జగన్ అధికారంలోకి వస్తే.. మళ్లీ ఆయన్ని దించడం వల్ల కాదు అనే ఒకే ఒక్క దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి చర్యలకు పునుకున్నారని ఆరోపించారు. నాడు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పోడిచి… నేడు ఎన్టీఆర్ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటావు … దీనిని ఏవిధంగా అర్థం చేసుకోవాలని చంద్రబాబును కొడాలి నాని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు వైస్రాయి హోటల్‌లో ఎమ్మెల్యేలకు డబ్బులు పంచిన ఘనత నీది అని చంద్రబాబుపై కొడాలినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్.. ఎన్టీఆర్ కథనాయకుడు చిత్రం ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీఎం చంద్రబాబు గురువారం విజయవాడలో దర్శకుడు క్రిష్, హీరో నందమూరి బాలయ్యతో కలసి తిలకించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానీ పై విధంగా స్పందించారు.