కాళ్ళకు కత్తులు.. కోట్లలో బెట్టింగ్‌లు!

14 January, 2018 - 4:08 PM

             (న్యూవేవ్స్ డెస్క్)

ఏలూరు: సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్… పోలీసుల వార్నింగులు బైపాస్.. భోగి పండుగ రోజు ఆదివారం ఉదయం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సంప్రదాయం పేరిట ప్రారంభమైన కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. ఒకప్పుడు డిక్కీ పందేలు (కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకుండా నిర్వహించే పందేలు), రాను రానూ కత్తుల పందేలుగా మారిపోయాయి. నిమిషాల వ్యవధిలో కోట్లాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి.

నిజానికి సంక్రాంతి పండుగ అంటేనే కోడిపందేల కోలాహలం. పండుగ మూడు రోజులూ మూడు పుంజులు, ఆరు పందేలు అనే చందంగా కోడిపందేలు జరగడం షరా మామూలే. కోస్తా జిల్లాల్లో ఆ సందడి మరింత రంజుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని పాలకొల్లు, కాకినాడ, భీమవరం, వెంప, ఏలూరు, తాడేపల్లిగూడెం, గుడివాడ తదితర ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అభయంతో తొలుత కత్తులు కట్టని పందేలను ప్రారంభించిన నిర్వాహకులు, అనంతరం కత్తులు కట్టి పందేలు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలవపూడిలో కత్తులు కట్టిన విషయం తెలుసుకున్న పోలీసులు, లాఠీచార్జి చేసి అక్కడి పందెంరాయుళ్లను తరిమి కొట్టడంతో తాత్కాలికంగా పందేలు ఆగిపోయాయి. కోడిపందేల నిర్వాహకులు చాలా చోట్ల పోలీసులను మేనేజ్ చేసినట్టు కూడా సమాచారం వస్తోంది.ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జరుగుతున్న కోడిపందేలకు దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన పందెం రాయుళ్లు భారీగా బెట్టింగ్‌‌లు కడుతున్నారు. కొన్నిచోట్ల వేలల్లో, మరికొన్ని చోట్ల లక్షల్లో బెట్టింగ్‌ సాగుతోంది. భారీ టెంట్లు, అదిరిపోయే ఏర్పాట్లతో కోడిపందేలు జరుగుతున్న ప్రాంతాలు తిరునాళ్లను తలపిస్తున్నారు.

ఇంకో విశేషం ఏంటంటే.. ఢిల్లీ, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల నుంచి ఉద్యోగాలు, ఉన్నత విద్యాభ్యాసాలు చేస్తున్న మహిళలు కూడా పెద్ద సంఖ్యంలో కోడిపందాలు చూసేందుకు తరలి వచ్చారు. వీరితో పాటుగా పలువురు ఎన్నారైలు కూడా కోడిపందేల్లో పాల్గొనడం గమనార్హం. ఉద్యోగాలు, చదువులకు సెలవు పెట్టి మరీ కోడిపందేలు చూడ్డానికి వచ్చిన కొందరు మహిళలైతే తాము కూడా బెట్టింగ్‌ వేసేందుకు రెడీగా ఉన్నామంటూ చెప్పడం విశేషం.

పనిలో పనిగా కోడిపందేల్లో భాగంగా గుండాట, ముడు ముక్కలాట, పేకాట లాంటి ఇతర గ్యాంబ్లింగ్ ఆటలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కోడిపందేలు జరిగే ప్రాంతాల్లో మద్యం కూడా ఏరులై పారుతోందని సమాచారం. కోడిపందేలను చూసేందుకు, వాటిలో పాల్గొనేందుకు వచ్చిన ఇతర ప్రాంతాల వారితో లాడ్జిలన్నీ కిక్కిరిసిపోయాయి. కోడిపందేల్లో పాల్గొనేందుకు వచ్చేవారు రెండు మూడు నెలల ముందు నుంచీ సమీప పట్టణాల్లోని లాడ్జి గదులను అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకున్నారు. ఈ మాత్రం ముందు జాగ్రత్త లేని ఔత్సాహికులు మాత్రం ఎక్కడ ఉండాలో తెలీక పలు ఇబ్బందుకు పడుతున్నారు.