‘కిర్రాక్ పార్టీ’ మూవీ రివ్యూ

16 March, 2018 - 4:40 PM

సినిమా: కిరాక్‌ పార్టీ
జానర్: యూత్‌‌ఫుల్‌ ఎంటర్‌‌టైనర్‌
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్‌, సిమ్రాన్‌ పరీన్జా, సంయుక‍్త హెగ్డే, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్: బి. అజనీష్‌ లోక్‌‌నాథ్‌
డైరెక్షన్: శరణ్ కొప్పిశెట్టి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర

హ్యాపీడేస్ చిత్రంతో సినిమా కెరీర్ ప్రారంభించిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టాలీవుడ్‌‌లో సక్సెస్‌‌లతో దూసుకెళ్తున్నాడు. స్వామి రారా సినిమాతో మొదలైన విజయాల వేట కేశవ వరకు కొనసాగింది. కన్నడంలో సక్సెస్ అయిన ‘కిరిక్ పార్టీ’ సినిమా రీమేక్‌‌గా ‘కిరాక్ పార్టీ’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోగా నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లుగా సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా నటించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా, దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్‌ప్లే అందించారు. ఈ మూవీ మార్చి 16న విడుదల అయింది. నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారథ్యంలో పక్కా కాలేజీ, యూత్ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందిన చిత్రం గురించి తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ్) మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్‌. స్నేహితులతో కలిసి కాలేజ్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుంటాడు. కాలేజికి బంక్‌ కొట్టడం, గొడవలు చేయటం ఇదే కృష్ణ జీవితం. ఆ సమయంలో సీనియర్‌ మీరా (సిమ్రాన్‌ పరీన్జా)ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఎలాగైనా ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తాడు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా తన లైఫ్‌ తాను ఎంజాయ్‌ చేసే కృష్ణను మీరా కూడా ఇష్టపడుతుంది. కానీ అనుకోండా ఓ ప్రమాదంలో మీరా చనిపోతుంది. మీరాను ప్రాణంగా ప్రేమించిన కృష్ణ పూర్తిగా మారిపోతాడు. కాలేజి అందరితో గొడవపడుతూ రౌడీలా మారిపోతాడు. మూడేళ్లు గడిచిపోతాయి. కృష్ణ గ్యాంగ్‌ ఫైనల్‌ ఇయర్‌‌ వస్తుంది. కృష్ణ హీరోయిజం చూసి జూనియర్‌ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను ఇష్టపడుతుంది. ఎలాగైనా కృష్ణను మామూలు మనిషిగా మార్చాలని, జీవితంలోని కొన్ని చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగాలని గుర్తు చేయాలనుకుంటుంది. మరి సత్య ప్రయత్నం ఫలించిందా? కృష్ణ మీరాను మర్చిపోయి సత్యకు దగ్గరయ్యాడా? ఈ కాలేజ్‌ లైఫ్‌ కృష్ణకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం కిరాక్ పార్టీ చూడాల్సిందే.

నటీనటులు: కృష్ణ పాత్రలో నిఖిల్ మంచి నటన కనబరిచాడు. హీరో నిఖిల్ పాత్రకు పలు రకాల షేడ్స్‌ కనిపిస్తాయి. అల్లరి చిల్లరిగా మెప్పించాడు. సెకండాఫ్‌‌లో సీనియర్ స్టూడెంట్‌‌గా అమ్మాయిలను ఏడిపిస్తే తాట తీసే లీడర్‌‌గా ఆకట్టుకున్నాడు. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం వల్ల నిఖిల్ తన పాత్రను మించి ప్రతిభను బయటపెట్టలేకపోయాడేమో అనిపిస్తుంది. ఇక లుక్‌ విషయంలోనూ మంచి వేరియేషన్‌ చూపించాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌‌తో పాటు క్లైమాక్స్‌‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌‌లో నిఖిల్ నటన చాలా బాగుంది.

ఇక ఫస్ట్‌‌హాఫ్‌లో హీరోయిన్‌ సిమ్రాన్‌ హుందాగా కనిపించింది. సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్‌ సంయుక్త హెగ్డే బబ్లీ గర్ల్‌గా కనిపించి సెంకడ్‌హాఫ్‌‌లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. బ్రహ్మాజీది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి కామెడీ పండించాడు. ఫ్రెండ్స్ పాత్రలో కనిపించిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు.

విశ్లేషణ:
తెలుగులో ఈ తరహా కథలు చాలా వచ్చాయి. హ్యాపిడేస్‌ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టించాయి. మరోసారి అదే తరహా కాలేజ్‌ డేస్‌‌ను గుర్తు చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శరణ్. అయితే ఎక్కడా కొత్తదనం కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడా కథనంలో మెరుపులు కనిపించినా గతంలో తెలుగు తెర మీద వచ్చిన చాలా కాలేజ్‌ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. క్లైమాక్స్‌‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ బాగున్నా, కథనం నెమ్మదిగా సాగటం ఇబ్బంది పెడుతుంది. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు దర్శకుడు. కన్నడ వర్షన్‌కు సంగీతం అందిచిన అజనీష్ తెలుగు వర్షన్‌‌కు కూడా మంచి సంగీతాన్ని అందించాడు. పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఏకే ఎంటర్‌‌టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారథ్యం సగటు సినిమా ప్రేక్షకుడి అభిరుచికి తగినట్టుగా ఉంది. సినిమాను చాలా రిచ్‌‌గా కనిపించడానికి ఎక్కడా రాజీ పడలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

సినిమాకు బలం:
నిఖిల్‌ నటన
రీ రికార్డిండ్
మ్యూజిక్
సంయుక్త హెగ్డే
సినిమాటోగ్రఫి
బలహీనతలు:
సినిమా నిడివి
స్క్రీన్‌ప్లే
డైలాగుల ఎడిటింగ్