‘ఖాకీ’ సినిమా రివ్యూ

17 November, 2017 - 12:30 PM

సినిమా : ‘ఖాకీ’
నటీనటులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు
దర్శకుడు : వినోథ్
నిర్మాత : ప్రభు, ప్రకాశ్ బాబు
సంగీతం : గిబ్రాన్
విడుదల తేది : నవంబర్ 17, 2017.

‘ఆవారా’, ‘ఊపిరి’, ‘చెలియా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు కార్తీ ఈసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ‘ఖాకీ’ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళం భాషలలో విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

కార్తీ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో చాలా ఎంటర్‌టైనింగ్ పాత్రలలో నటించాడు. కానీ తొలిసారిగా ‘ఖాకీ’ సినిమాలో సీరియస్ మూడ్‌తో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇందులో కొత్త కార్తీని చూస్తారు. ట్రాన్స్‌ఫర్లకు బయపడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో కార్తీ దుమ్మురేపాడు. దాదాపు ఈ సినిమా అంతా కూడా యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక సినిమా అంతా కార్తీ సీరియస్ మూడ్‌తో కొనసాగితే… హీరోయిన్ రకుల్ కాస్త ఎంటర్‌టైనింగ్ అని చెప్పుకోవచ్చు. రకుల్, కార్తీల మధ్య వచ్చే సీన్లు కాసేపు ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. హోమ్లీ లుక్‌తో రకుల్ చాలా బాగా చేసింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలలో పర్వాలేదనిపించారు.

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో అసలు కథ మొదలవుతుంది. దోపిడి ముఠాలను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ నటించాడు. కథ అంతా కూడా అసలు నేరస్థుడు ఎవరా అనే అంశంపై నడుస్తోంది. సినిమాలో ప్రారంభమైన క్షణం నుంచే కాస్త ఆసక్తిగా మొదలవుతుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతున్న ఈ సినిమాలో రకుల్ ఓ ఎంటర్‌టైన్మెంట్ ఎలిమెంట్. నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నించిన కార్తీ ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? అందుకు కార్తీ ఎంచుకున్న మార్గాలేంటి అనే అంశాలు కాస్త థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. కానీ కార్తీ అంటే ఎంటర్‌టైన్మెంట్. అలాంటిది ఇందులో కార్తీ నుంచి ఎంటర్‌టైన్మెంట్ కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఇదొక మంచి ఇంట్రస్టింగ్‌ సినిమా అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్‌ కంటే సెకండ్ హాఫ్‌లో నేరస్థులను పట్టుకోవడానికి కార్తీ వేసే ప్లాన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి.

ఇక దర్శకుడు వినోత్ కథను చాలా చక్కగా చూపించాడు. స్క్రీన్‌ప్లే పరంగా బాగా డిజైన్ చేసాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ను బాగా ప్లాన్ చేసాడు. హీరో క్యారెక్టర్లో కాస్త ఫన్ ఎలిమెంట్స్‌ కూడా పెట్టివుంటే సినిమా మరింత జోష్‌తో కొనసాగి వుండేదేమో. దర్శకుడిగా వినోత్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫి బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లు, బస్ ఫైట్ సీన్లలో బాగా చూపించారు. గిబ్రాన్ సంగీతం అందించిన పాటలు పర్వాలేదనిపించినా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా…. ఖాకీ సినిమా ఓ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు.