ఫెడరల్ ఫ్రంట్‌నూ పరుగులు పెట్టిస్తారా..?

17 April, 2018 - 5:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఎక్కడ సర్దుకుపోవాలి… ఏ వైపు నుంచి ఎలా నరుక్కురావాలి అనే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ది నిజంగా అందెవేసిన చెయ్యి అనే చెప్పాలి. అందుకు ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ స్థాపించి.. ఎన్నికల్లో విజయం సాధించినా.. ఉద్యమ పరంగా కొద్ది కాలం స్తబ్ధుగా ఉన్నా… 2009 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ఉద్యమాన్ని ఊరుకులు పరుగులు పెట్టించిన నేత ఆయన. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే వరకు అప్పటి యూపీఏ ప్రభుత్వానికీ కంటి మీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదేమో.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు రాష్ట్ర తొలి సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కేంద్రంలోని గత ప్రభుత్వాలు అయితేనేమీ.. ప్రస్తుత మోదీ ప్రభుత్వం అయితేనేమీ… వివిధ రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఉంటే గింటే హస్తం లేకుంటే కమలం పార్టీల పెత్తనమేనా… ఇంకో పార్టీ ఉండకూడదా.. దేశంలో గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించారు. అంతే కాదు రోడ్డు మ్యాప్ కూడా తయారు చేసుకున్నారు. సీఎంగా తెలంగాణ ప్రజలకు మాత్రమే న్యాయం చేయడం కాదు… పీఎంగా దేశ ప్రజలకు.. తెలంగాణ జాతికి అందుతున్న ఫలాలు అందాలంటూ తన మనసులోని మాట చెప్పారు.

అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులను ఏకతాటిపైకీ తీసుకువచ్చి.. వారిందరితో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ముందుగా పశ్చిమ బెంగాల్ వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎం మమతతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ అయితే హైదరాబాద్‌కే వచ్చి… కేసీఆర్‌‌‌తో సమావేశమై, తన మద్దతు ప్రకటించారు. ఇటీవల సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లి, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడతో సమావేశమై, ఫెడరల్ ఫ్రెంట్‌ ఏర్పాటుపై చర్చించారు. ఇక మే మొదటి వారంలో ఒడిశా వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌‌తో కేసీఆర్ భేటీ అయి.. హస్తిన లక్ష్యంగా పావులు కదపనున్నారు.

కాగా.. కేరళ సీఎం పినరయి విజయన్‌ సీపీఐ మహాసభ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చారు. ఆయన ఏప్రిల్ 23 వరకు హైదరాబాద్‌‌లోనే ఉంటారు. ఈ నేపథ్యంలో విజయన్‌‌తో కూడా కేసీఆర్ సమావేశం కానున్నారని సమాచారం. మొత్తం మీద ఫెడరల్ ఫ్రంట్‌ను పరుగులు పెట్టించే వ్యూహంతో కేసీఆర్ ముందుకు సాగిపోతుండడం విశేషం.