కర్ణాటక స్పీకర్ షాకింగ్ నిర్ణయం

22 July, 2019 - 9:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. జేడీఎస్- సంకీర్ణ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం తన బలా నిరూపించుకునేందుకు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ డెడ్‌లైన్‌ విధించారు. సోమవారం రాత్రి 9 గంటల వరకూ బలనిరూపణకు సమయం ఇస్తున్నట్టు సీఎం కుమారస్వామికి సూచించారు. రాత్రి 9 గంటల లోగా సీఎం బలపరీక్షకు రెడీ కాకపోతే తానే రాజీనామా చేస్తానంటూ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించారు.

నిజానికి కర్ణాటక శాసనసభలో పరిణామాలు సోమవారం ఉదయం నుంచీ అనూహ్యంగా మలుపులు తిరగుతూ వస్తున్నాయి. ఈ రోజు బలపరీక్ష నిర్వహిస్తామని స్పీకర్‌ రెండు రోజుల ముందే ప్రకటించినప్పటికీ అధికార కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి మాత్రం దానికి వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చింది. సభలో సమయాన్ని వృథా చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీన్ని ప్రతిపక్ష బీజేపీ పలుమార్లు వ్యతిరేకించింది. అయితే.. స్పీకర్  సభలో అధికార పక్షానికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు.

ఈ నేపథ్యంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌తో సీఎం కుమార స్వామి భేటీ అయ్యారు. బలపలరీక్ష ఈ రోజే నిర్వహిస్తానని స్పీకర్‌ సీఎంకు స్పష్టం చేశారు. రాత్రి 9 గంటల వరకు సమయం ఇస్తూ.. ఈ లోగా బలపరీక్షకు సిద్ధం కావాలని సీఎంకు సూచించారు. సుప్రీంకోర్టులో తమ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున తమకు రేపటి వరకూ సమయం ఇవ్వాలంటూ జేడీఎస్‌ సభ్యులు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పీకర్‌ నిరాకరించారు. మరోవైపు బీజేపీ సభ్యుల నుంచి స్పీకర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో రాత్రి 9 గంటల లోగా సీఎం బలపరీక్షకు సిద్ధం కాకపోతే తానే రాజీనామా చేస్తానని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించడం చర్చనీయాంశమైంది.