రాహుల్‌తో కుమారస్వామి భేటి

18 June, 2018 - 2:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కర్ణాకల రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే విషయంలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం హెచ్‌‌డీ కుమారస్వామి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీనియర్‌ జేడీఎస్‌ నేత ధనిష్‌ అలీ, కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్ధాయి బడ్జెట్‌‌ ప్రవేశపెట్టాలని జేడీఎస్‌ పట్టుబడుతుండగా, కాంగ్రెస్‌ మాత్రం తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెడితే సరిపోతుందని వాదిస్తోంది. కొత్త ప్రభుత్వ దశాదిశను స్పష్టం చేసేందుకు పూర్తిస్ధాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని జేడీఎస్‌ స్పష్టం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని కలుస్తానని సీఎం కుమారస్వామి గతంలోనే పేర్కొన్నారు.

అయితే.. కొద్ది నెలల క్రితమే సీఎంగా తాను బడ్జెట్‌ ప్రవేశపెట్టిన క్రమంలో ప్రస్తుతం నూతన బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని మాజీ సీఎం సిద్దరామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం నిర్దిష్ట ప్రాజెక్టులు, పథకాలు చేపట్టదలిస్తే అనుబంధ బడ్జెట్‌‌లో వాటిని పొందుపరచవచ్చని ఆయన కుమారస్వామికి సూచించారు. దీంతో వీరి మధ్య పంచాయతీ ఎంతకూ ఒక కొలిక్కి రాకపోవడంతో నేరుగా కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ను కలిసి చర్చించేందుకు కుమారస్వామి ఢిల్లీ వచ్చారు.