కాంగ్రెస్ పార్టీ గౌరవంగా మెలగాలి

14 January, 2019 - 4:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీ తమతో గౌరవప్రదంగా మెలగాలని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలిసే పోటీచేయాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు చర్చలు జరుపుతున్నాయన్నారు. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ తీరు బాగోలేదని కొందరు జేడీఎస్‌ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోందన్నారు. ఓ ఇంటర్వ్యూలో కుమారస్వామి మాట్లాడుతూ.. పొత్తులపై స్పందించారు.

జేడీఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీ తక్కువగా అంచనా వేయవద్దని, సీట్ల పంపిణీ విషయంలో ఇచ్చి పుచ్చుకునే విధానంతో వ్యవహరించాలని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ‘ఇరు పార్టీలు కలిసే పోటీచేయాలని మేం భావిస్తున్నాం. మా రాష్ట్రంలో బీజేపీని అడ్డుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే మా పార్టీలు కలిశాయి. ఇదే వాతావరణాన్ని దేశంలో కూడా తేవడానికి మళ్లీ కలిసే పోటీ చేయాలనుకుంటున్నాం’ అన్నారు.
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌‌సభ స్థానాలు ఉండగా వాటిలో జేడీఎస్‌ 12 స్థానాల కోసం డిమాండ్ చేస్తోంది.

2014 ఎన్నికల్లో బీజేపీ 17, కాంగ్రెస్‌ 9, జేడీఎస్‌ 2 చోట్ల గెలిచాయి. కాంగ్రెస్‌‌తో పొత్తు ఏర్పాటు విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి తెలిపారు. ‘మూడింట రెండో వంతు సీట్లు కాంగ్రెస్‌‌కి, మూడింట ఒకటో వంతు జేడీఎస్‌‌కి దక్కాలని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు (హెచ్‌‌డీ దేవెగౌడ) భావిస్తున్నారు. ఈ సూత్రాన్ని కాంగ్రెస్‌ ఒప్పుకుంటుందని మేం అనుకుంటున్నాం’ అని అన్నారు.