‘తొందరపాటు నిర్ణయం తీసుకోను’

11 July, 2019 - 9:06 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: ఎమ్మెల్యేల రాజీనామాలపై ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు వస్తున్న వార్తలు తనను బాధించాయని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ తనకు ఆరో తేదీన సమాచారం ఇచ్చారన్నారు.

అంతకుముందు తనను కలుస్తానని ఏ ఎమ్మెల్యే కూడా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిసి తాను కార్యాలయం నుంచి వెళ్లిపోయానన్న మాట అవాస్తవం అని స్పీకర్ చెప్పారు. జులై 6న మధ్యాహ్నం 1.30 వరకు తాను తన చాంబర్‌లోనే ఉన్నానని ఆయన తెలిపారు. ఆ రోజున ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2.00 గంటలకు వచ్చారన్నారు.

అయితే వాళ్లు ఎలాంటి అపాయింట్‌మెంట్ తీసుకోకుండా వచ్చారని చెప్పారు. గురువారం బెంగళూరులో స్పీకర్ రమేష్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ… ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్‌లోనే రాజీనామాలు సమర్పించారని తెలిపారు.

కానీ గతంలో ఇచ్చిన వాటిలో 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో లేవని ఆయన గుర్తు చేశారు. రాజీనామాలు స్వచ్ఛందంగా, సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తానని ఆయన వెల్లడించారు. అయితే తాను తొందరపాటు నిర్ణయం తీసుకొనని స్పీకర్ రమేష్ కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్‌ను అసమ్మతి ఎమ్మెల్యేలు గురువారం కలిసిన సంగతి తెలిసలిందే. కాగా ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజీనామా చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 10 మందికి స్పీకర్‌ను కలిసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం విదితమే.