‘మన దురదృష్టం’

16 March, 2020 - 8:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరుపతి: పక్క తెలంగాణ సీఎం కరోనాపై నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంటే.. మన ముఖ్యమంత్రి జగన్ మాత్రం కరోనా జబ్బు కాదంటూ పారాసెటిమల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపొతుందంటూ చెప్పడం.. మన దురదృష్టం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కరోనా వల్ల ప్రపంచమంతా వణికిపోతుందని.. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో స్కూళ్లు, సినిమాహళ్లు అన్ని మూసివేస్తుంటే.. మన ముఖ్యమంత్రి మాత్రం కరోనా జబ్బే కాదని ప్రకటించింది వైయస్ జగన్ మాత్రమే అని కన్నా పేర్కొన్నారు. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

సోమవారం తిరుపతిలో కన్నా విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయని మొదటి నుంచి చెబుతునే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీ పడి మరీ.. తమ తమ ప్రాంతాల్లో అభ్యర్థులు ఏకగ్రీవం చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పోలీసులు అయితే.. అధికార పార్టీ నాయకులతో కలిసి పోయి పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  తన రాజకీయ అనుభవం దాదాపు 46 ఏళ్లు ఉందని.. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చూడలేదన్నారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతే అరాచకాలు జరిగే పరిస్థితి ఉంటుందన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను సైతం కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ముఖ్యమంత్రి జగన్ .. సామాజిక వర్గం అంటగట్టడం దారుణమని కన్నా పేర్కొన్నారు. సాక్షాత్తు ఏపీ డీజీపీకి హైకోర్టు అక్షంతులు వేసినా.. పోలీసు వ్యవస్థలో మార్పు రాకపోవడం పట్ల కన్నా ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని కన్నా డిమాండ్ చేశారు.