‘ముందే ఊహించాం’

26 May, 2019 - 5:52 PM

(న్యూవేవ్స్ డెస్క్)

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపు ముందు ఊహించిందే అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. వైయస్ జగన్‌ ఈ ఎన్నికల్లో 130కి మించి సీట్లు వస్తాయని తాము ముందే భావించినట్లు చెప్పారు.

కాకుంటే ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు… డబ్బు, మద్యం ఏరులై పారించాయని ఆయన విమర్శించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కాస్తా.. ప్రతిపక్షం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చిందని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణం.. గత ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసామని.. ఆ తర్వాత ఆయన తమ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేశాడని ఆరోపించారు. దాంతో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవలేక పోయిందన్నారు.

ఆదివారం గుంటూరులోని తన నివాసంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో కన్నా స్పందించారు. నరేంద్ర మోదీ చరిష్మాతోనే బీజేపీ మరోసారి అఖండ మెజార్టీతో గెలిచిందన్నారు.

దేశంలోని పెద్ద వ్యాపారుల నుంచి చిన్న వ్యాపారుల వరకు అంతా మోదీ పాలనపై పూర్తి సంతృప్తి చెందారన్నారు. మోదీ ఉంటే ఇండియా అవుతుందని.. లేకుంటే పాకిస్థాన్ అవుతుందని కన్నా వ్యాఖ్యానించారు.

కేంద్రంలో మోదీ మళ్లీ గెలుస్తారని మూడోందలకు మించి లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామని తాను గతంలో చెప్పానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను చెప్పిందే నిజమైందన్నారు. ఎన్నికల సందర్భంగా దాదాపు 6 రాష్ట్రాలు తాను తిరిగానని.. ప్రతి చోట ప్రజల్లో … మోదీ హవానే కనిపించిందని కన్నా తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం దేశ ప్రజలపై అంతగా కనబడలేదన్నారు.

నోట్ల రద్దు తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని.. వాటిలో చాలా చోట్ల బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. కాకుంటే నోట్ల రద్దు ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కనిపించిందన్నారు. నోట్ల రద్దు తర్వాత ఏపీలో అందునా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి కారణంగా ప్రజలకు నోట్లు అందలేదని ఆయన పేర్కొన్నారు.