కనకదుర్గకు ఎంత కష్టం.. ఎంత కష్టం..!

30 January, 2019 - 12:17 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరువనంతపురం: అత్త, భర్త ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశారు.. పోనీ పుట్టింట్లోనైనా తలదాచుకుందామనుకున్న ఆమెను సోదరుడు తరిమేశాడు.. దాంతో ఓ ప్రభుత్వ హోంలో తలదాచుకుంటోంది. ఇదీ శబరిమలలోని అయ్యప్పస్వామిని తొలిసారి దర్శించుకున్న ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గ పరిస్థితి. అయినప్పటికీ ఆమె తన ధైర్యాన్ని మాత్రం వీడడం లేదు.. తన ఇంట్లోకి వెళ్ళేందుకు న్యాయపోరాటం చేస్తానంటోంది.

రుతుక్రమంలో ఉన్న (10 నుంచి 50 ఏళ్ళ వయసు) మహిళలు ఆజన్మ బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామిని దర్శించుకోకూడదనే నియమం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే.. రుతుక్రమంలో ఉన్న మహిళలు కూడా అయ్యప్పను దర్శించుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇద్దరు స్నేహితురాళ్ళు బిందు అమ్మిని (40), కనకదుర్గ (39) 2019 జనవరి 2న దర్శనం చేసుకున్నారు. అయితే.. ఇలా అయ్యప్పస్వామిని దర్శించుకోవడంలో సఫలమైన ఈ కేరళ మహిళ కనకదుర్గ ఇప్పుడు తన ఇంట్లోకి వెళ్ళడం కోసం పెనుగులాడాల్సి వస్తోంది.

అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న బిందు, కనకదుర్గ తిరిగి సాధారణ జీవనంలోకి అడుగు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. కనకదుర్గకు అటు అత్తింటి నుంచి ఇటు పుట్టింటి నుంచి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మలప్పురం జిల్లాలోని అంగడిపురం కనకదుర్గ ఊరు. 2018 డిసెంబర్‌ 22 న ఆమె తమ ఇంటి నుంచి అయ్యప్ప దర్శనం కోసం తన స్నేహితురాలితో బయలుదేరింది. అయితే.. వారికి అయ్యప్ప ఆలయ ప్రవేశం వెంటనే సాధ్యపడలేదు. శబరిమలకు సమీపంలోని ఓ రహస్య ప్రదేశంలో వేచి ఉన్నారు. చివరికి 2019 జనవరి 2న వారు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. స్త్రీల గౌరవం కోసం, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, దేశంలో మహిళల సమానత్వం కోసమే తాము ఈ పని చేశామని కనకదుర్గ చెబుతోంది.

అయ్యప్పస్వామిని దర్శించుకున్న అనంతరం జనవరి 15న కనకదుర్గ తన ఇంటికి చేరుకుంది. అయితే.. ఇంట్లో ప్రవేశించడానికి ఆమె భర్త, అత్త అడ్డు చెప్పారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారిని కొద్ది నిమిషాల సేపే ఆమె చూడగలిగిందట. తానెందుకు ఇంట్లోకి రాకూడదని ప్రశ్నించినందుకు ఆమె అత్త ఆమె బుర్ర పగుల గొట్టింది. తమ ఊరు అంగడిపురం ఆస్పత్రిలో వైద్యం సరిపోక కోజికోడ్‌ ఆస్పత్రిలో వారం రోజులు ఆమె ఉండాల్సి వచ్చింది.

అయితే.. కనకదుర్గకు పుట్టింట్లో కూడా ఆదరణ అందడంలేదు. అత్తింటివారు ఆదరించని వేళ, కనీసం పుట్టింటికైనా వెళ్లాలని ఆమె ప్రయత్నిస్తే.. సోదరుడు ఇంట్లోకి రానివ్వలేదట. దీంతో కనకదుర్గ ప్రస్తుతం ఒక ప్రభుత్వ హోంలో ఉంటోంది. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించిన కనకదుర్గ.. తమవారంతా తనపై చాలా కోపంగా ఉన్నారని వాపోయింది. అత్త తన తలపై బలంగా కొట్టిన దెబ్బతో సుమారు వారం రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొంది, ఆపై పుట్టింటికి వెళ్లగా.. ఆమె సోదరుడు బయటకు తరిమేశాడు.

అత్త కొట్టిన దెబ్బకి ఇప్పటికీ కూడా కనకదుర్గ తల తప్పలేక, సరిగ్గా మాట్లాడలేక అవస్థ పడుతోందట. తన ఇంట్లో నుంచి తనను తరిమేయడానికి తానేం పాపం చేశాంటూ ఆమె ప్రశ్నిస్తోంది. కొందరు పెద్దలు ఆమె భర్తతో మాట్లాడితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆలోచిస్తానని అన్నాడట. తాను చేసిన పనికి ఎవరికైనా క్షమాపణ చెప్పడం కానీ, ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కానీ చేయనని కనకదుర్గ తెగేసి చెబుతోంది. తన ఇంట్లో తాను ప్రవేశించడానికి చట్టబద్ధంగా పోరాడతానని, కోర్టుకు వెళతానని చెబుతోందామె.