దుర్గమ్మ సొమ్ము దుబారా..!

12 September, 2017 - 5:48 PM

(న్యూవేవ్స్ ప్రతినిధి)

విజయవాడ: ‘రాజుల సొమ్ము రాళ్ళ పాలు’ సామెత ఎలా వచ్చిందో కాని.. బెజవాడ కనక దుర్గమ్మ సొమ్ము మాత్రం అధికారుల పాలు అయిపోతోందనే ఆరోపణలు సర్వత్రా వస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులు సరైన ప్రణాళిక లేకుండా అధికారుల ఇష్టానుసారంగా జరుగుతున్నాయంటున్నారు. ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా…’ అనే సామెతను కనక దుర్గమ్మ దేవస్థానం అధికారులు నిజం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే సీఎం వాహన శ్రేణికి అడ్డంగా ఉన్నాయనే నెపంతో ఘాట్‌రోడ్‌లో లక్షలు వెచ్చించి చేసిన ఏర్పాట్లను తొలగిస్తున్నారు. సీఎం కాన్వాయ్‌కి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను కూడా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండడం ఈ విమర్శలకు తావిస్తోంది. కనక దుర్గమ్మ సొమ్మంటే అధికారులకు అలుసుగా కనిపిస్తోందని భక్తులు నిప్పులు చెరుగుతున్నారు.

దసరా ఉత్సవాల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి ఘాట్‌రోడ్‌లో పలు నిర్మాణాలు చేపట్టారు. గత ఏడాది నుంచి ఘాట్‌రోడ్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేసి మరీ అభివృద్ధి పనులు చేపట్టారు. దసరా ఉత్సవాలు దగ్గర పడుతుండటంతో ఘాట్‌రోడ్‌లో చేపట్టిన పనులు, అలాగే భక్తులను కింది నుంచి ఘాట్‌రోడ్ మీదుగా పైకి పంపేందుకు క్యూలైన్ల ఏర్పాటును పూర్తి చేశారు. దీనిలో భాగంగా ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో అందం, ఆహ్లాదం కోసం పచ్చటి మొక్కలతో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా ఈ మొత్తం గ్రీనరీని అధికారులు తొలగించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి సీఎం చంద్రబాబు వచ్చే అవకాశం ఉండటంతో, ఆయన కాన్వాయ్‌కి ఈ గ్రీనరీ అడ్డంగా ఉందనే పేరుతో పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనితో మొత్తం గ్రీనరీని తొలగించాలని అధికారులు నిర్ణయించారు.ఇంద్రకీలాద్రి వైపు ఓం టర్నింగ్ నుంచి ఆలయం దిశగా సుమారు వంద అడుగుల మేర ఏర్పాటు చేసిన గ్రీనరీ తొలగించాలంటూ పోలీసులు ఆలయ అధికారులకు సూచించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను కూడా వెనక్కి జరపాలని ఆదేశించారు. సీఎం బస్సులో ఆలయానికి వచ్చే అవకాశం ఉండటం వల్ల బస్సుతో పాటు భద్రతా వాహనాలు ఓం టర్నింగ్ వద్ద తిరగాలంటే, ఇప్పుడున్న గ్రీనరీ, క్యూలైన్లు అడ్డుగా ఉన్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. తక్షణం వాటిని తొలగించి, అవసరమైన మార్పులు చేయాలని సూచించారు.

అయితే.. ముందుగా దుర్గగుడి అధికారులు దసరా ఉత్సవాల సందర్భంగా పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపకశాఖ, దేవాదాయశాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి, సలహాలు, సూచనలు తీసుకుని ఉంటే, ఈ వృథా ఖర్చు తప్పేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐఎఎస్ అధికారిణి సూర్యకుమారిని ఆలయ ఈఓగా నియమించడం వల్ల గతంలో ఆలయంలో అనుసరిస్తున్న విధానాలపై ఆమెకు వివరించేందుకు కిందిస్థాయి సిబ్బంది వెనుకాడుతున్నారు. దీనితో ఏకపక్షంగా ఆలయ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలే అమలు జరుగుతున్నాయి.

తీరా అన్ని పనులూ పూర్తయిన తరువాత వీఐపీల భద్రత అంటూ అటు పోలీసులు, ఇటు రెవెన్యూ, ఫైర్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో మళ్లీ, మళ్లీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి అమ్మవారి సొమ్మే హారతి కర్పూరంగా ఖర్చు చేస్తున్నారనే ఆవేదన భక్తుల్లో వ్యక్తమవుతోంది.

భక్తులు ఇప్పటికే సుమారు పదిలక్షల రూపాయలు వెచ్చించి దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో గ్రీనరీ ఏర్పాటు చేశారని, సీఎం వస్తున్నారనే పేరుతో దీనిని తొలగించి మళ్లీ సిమెంట్ రోడ్ వేయడం వల్ల పెట్టిన ఖర్చు వృథా అవుతోందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దసరా ఉత్సవాలు పూర్తయిన తరువాత మళ్లీ సిమెంట్ రోడ్‌ను తొలగించి గ్రీనరీ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతుండడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఈ సొమ్మంతా భక్తులు అమ్మవారికి కానుల రూపంలో ఇచ్చిన సొమ్మే కావడంతో అధికారుల అనాలోచిత నిర్ణయాల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.