ఇంద్రకీలాద్రిపై ‘కుంభకోణం’ నిజమే

06 December, 2018 - 2:20 PM

  

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కోలువైన శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరిగిన మెమొంటో కుంభకోణం కేసులో విజయవాడ పోలీసులు పురోగతి సాధించారు. మెమొంటోల కోనుగోలులో అక్రమాలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో నలుగురి ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ అక్రమాలకు పాల్పడిన నలుగురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ప్రతి ఏటా దసరా శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతాయి.

 

ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి మెమొంటోలు అందజేస్తారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారికి మెమొంటోలు అందజేశారు.

అయితే 1200 మెమొంటోలను దేవాలయ సిబ్బంది కొనుగోలు చేశారు. కానీ 2000 మెమొంటోలు కొనుగోలు చేసినట్లు రశీదుల్లో పేర్కొన్నారు. ఈ విషయం శరన్నవరాత్రులు అయిన తర్వాత ఆలయ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో వారు ఈవో కోటేశ్వరమ్మకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆమె ప్రాథమిక విచారణ జరిపి… ఈ కుంభకోణానికి బాధ్యులుగా భావించి.. నలుగురిపై వేటు వేసింది. అంతేకాదు… నగరంలోనో వన్ టౌన్ పోలీసులకు ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దీంతో కుంభకోణం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఆలయ డిప్యూటీ ఈవో అచ్యుత రామయ్య పాత్ర కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నలుగురులో ఆయన కూడా ఉన్నారు.