జగన్ ఇంకొక్క రోజు పాదయాత్ర…

10 January, 2019 - 4:58 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీకాకుళం: ఇంకొక్క రోజు వైయస్ జగన్ పాదయాత్ర చేసి ఉంటే… టీడీపీకి వచ్చిన ప్రజాదరణ చూసి వెళ్లేవారని శ్రీకాకుళం ఎంపీ కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో మనం పోరాడుతుంటే… వైయస్ జగన్ మాత్రం మోదీ దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. గురువారం శ్రీకాకుళంలో కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ….

కేసులకు భయపడి వైయస్ జగన్ ఒక్కసారిరక కూడా మోదీని ప్రశ్నించలేదన్నారు. దేశంలో మోదీపై తిరగబడ్డ ఏకైక సీఎం చంద్రబాబు అని రామ్మోహన్ నాయుడు ఈ సందర్బంగా స్పష్టం చేశారు. సరదాకి చేసే వాకింగ్ కూడా వైయస్ జగన్ పాదయాత్రగా ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు.

జనం ఇబ్బందుల్లో ఉన్నా వైయస్ జగన్‌కి పట్టదని ఆరోపించారు. వైయస్ జగన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేయగలిగారంటే… జిల్లా ప్రజల గొప్పదనం అని పేర్కొన్నారు. వైయస్ జగన్‌ది నాలుగు రోజుల పాదయాత్ర.. మూడు రోజుల కోర్టు యాత్ర చేసారన్నారు.

వైయస్ఆర్ సీపీ నాయకులు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లయినా దక్కుతాయన్నారు. టీడీపీకి మరోసారి అవకాశం ఇచ్చి పది స్థానాల్లో గెలుపించుకోండి అని శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు.