‘పెప్పర్ స్ప్రేకి బాధ్యులు ఎవరు ?’

12 August, 2019 - 7:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ పార్టీ లాలూచీ రాజకీయాలు చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ… అధికార పార్టీకి ప్రధాన అనుచర పార్టీగా పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ అయిందని.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తోడు దొంగలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఇద్దరు బీజేపీపై ఒకే విధమైన ఎదురు దాడికి దిగుతున్నారని కె లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు .. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా అస్త్ర సన్యాసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తరఫున గెలిచన ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారని… మిగిలిన వారు తలో దిక్కుకు వెళ్లిపోయారని అన్నారు.

అలాంటి పార్టీలో నిజాయితీగా ఉన్న నాయకులంతా నేడు బీజేపీలోకి వస్తున్నారంటూ డీకే అరుణ, సుధాకర్ రెడ్డి, విజయరామారావు పేర్లను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. బీజేపీకి తెలంగాణ ఇష్టం లేదని దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్మణ్ గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై పార్లమెంట్‌లో తమ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఏం మాట్లాడారో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కి తెలియదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

ప్రత్యేక రాష్ట్ర విభజన బిల్లు ఆమోద సమయంలో తెలంగాణలో ఒక్క బీజేపీ ఎంపీ లేకున్నా .. బిల్లు ఆమోదం పొందెందుకు తమ పార్టీ ఎంపీలు అందరూ సహకరించిన విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్మణ్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం మీ పార్టీ నేతలకు ఇష్టం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీకు ఇష్టమే ఉండి ఉంటే.. విప్ జారీ చేసి అన్ని సక్రమంగా జరిగేవని లక్ష్మణ్ పేర్కొన్నారు.

కానీ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో పెప్పర్ స్ప్రే ఘటన చోటు చేసుకుందని గుర్తు చేశారు. ఈ ఘటన బాధ్యుల ఎవరు అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను లక్ష్మణ్ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో… తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యుడు ఆర్ సి కుంతియా ఎక్కడ ఉన్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు.