కోర్టులో తేజ్‌పాల్‌‌‌కు చుక్కెదురు

28 September, 2017 - 5:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పనాజీ: అత్యాచారయత్నం కేసులో ప్రముఖ జర్నలిస్ట్, తెహెల్కా మ్యాగజైన్ మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌‌పై గోవాలోని మపుసా కోర్టు గురువారం అభియోగాలు నమోదు చేసింది. తన జూనియర్ సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తేజ్‌పాల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. తనపై అభియోగాలను నెలరోజుల పాటు వాయిదా వేయాలని తేజ్‌పాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని కూడా కోర్టు నిరాకరించింది. నవంబర్ 21 నుంచి ఈ కేసు విచారణ చేపట్టనున్నట్లు కోర్టు వెల్లడించింది.

2013 నవంబరులో గోవాలో మ్యాగజైన్ ‘థింక్ 2013’ ఫెస్టివల్‌ జరిగింది. అక్కడ ఫైవ్ స్టార్ హోటల్‌లోని లిఫ్ట్‌లో తన జూనియర్ సహోద్యోగినిని తేజ్‌పాల్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. తెజ్‌పాల్ తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు తన సీనియర్‌లకు ఫిర్యాదు చేసింది. తేజ్‌పాల్‌ తనకు పంపించిన ఈ-మెయిల్ సందేశాలను బాధితురాలు మేనేజింగ్ ఎడిటర్ శోభా చౌదరికి చూపించింది. దీంతో ఆమె వార్త ప్రచురించింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నవంబర్ 30న తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 376, 341, 342, 354ఏ, 354బి కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈ కేసు నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ తేజ్‌పాల్‌ ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఇవాళ మపుస కోర్టు విచారణ చేపట్టి తేజ్‌పాల్ పై అభియోగాలు నమోదు చేసింది.