శ్రీదేవి సంతాపసభలో జాన్వి ఉద్వేగం

12 March, 2018 - 12:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: ప్రముఖ సినీనటి శ్రీదేవి సంతాపసభ సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీ ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. గత నెల 24న దుబాయ్‌లో హఠాన్మరణం పొందిన శ్రీదేవికి ఆదివారం చెన్నైలో సంతాపసభ నిర్వహించారు. ఈ సంతాప సభకు బోనీకపూర్, ఆయన కుమార్తెలు జాన్వి, ఖుషీ, శ్రీదేవి సోదరి శ్రీలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అతిలోక సుందరి శ్రీదేవికి మూగబోయిన గొంతుతో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మౌనంగానే నివాళులర్పించారు.

కాగా.. ముంబై నుంచి బీఎస్‌‌పీ పార్టీ నేత అమర్‌‌సింగ్, టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌‌బాబు తదితరులు శ్రీదేవి సంతాపసభలో పాల్గొన్నారు. శ్రీదేవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సినీ ప్రముఖులు, బంధువులు, ఆప్తులు శ్రీదేవితో తమ అనుభవాలను పంచుకోకుండానే, ఎలాంటి ఉపన్యాసాలు లేకుండా మౌనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీదేవి కుటుంబ సభ్యులను సినీ ప్రముఖులు ఓదార్చారు. ఆ సమయంలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కంటతడి పెట్టుకుంది.

మరోవైపు ఈ సంతాప సభకు మీడియాను అనుమతించలేదు. మీడియాకు అనుమతి లేదని చెప్పినా, ఎందుకు వచ్చారని శ్రీదేవి కుటుంబీకులు ప్రశ్నించడంతో ఎలక్ట్రానిక్‌ మీడియా బృందం హోటల్‌ ముందు భాగంలోనే ఉండి సంతాప సభకు వచ్చిన వారి విజువల్స్ చిత్రీకరించారు.

చెన్నైలోని ఆళ్వార్‌‌పేటలో ఉన్న శ్రీదేవి నివాసానికి ఆదివారం ఉదయం ప్రముఖ హీరో అజిత్‌, షాలిని దంపతులు వెళ్లి అక్కడ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం శ్రీదేవి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరోవైపు దక్షిణ భారత నటీనటుల సంఘం నివాళులు అర్పించింది. సీనియర్‌ నటుడు శివకుమార్‌, నటి అంబిక, కుట్టి పద్మిని, సంఘ కోశాధికారి కార్తీ పాల్గొన్నారు.