‘జవాన్’ మూవీ రివ్యూ

01 December, 2017 - 10:51 AM

సినిమా : ‘జవాన్’
నటీనటులు : సాయిధరమ్ తేజ్, మెహరిన్, ప్రసన్న తదితరులు
దర్శకుడు : బివిఎస్ రవి
నిర్మాత : కృష్ణ
సంగీతం : థమన్
విడుదల తేది : డిసెంబర్ 1, 2017.

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్, మెహరిన్ జంటగా నటించిన ‘జవాన్’ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బివిఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కృష్ణ నిర్మించారు. థమన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

కథ:
న్యూక్లియర్ ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన RSS కుర్రోడు జై (సాయిధరమ్‌తేజ్). DRDOలో పనిచేయాలనేది తన గోల్. ఇండియన్ ఆర్మీ కష్టపడి తయారుచేసిన ‘ఆక్టోపస్’ మిసైల్‌ను దొంగలించి, దానిని శత్రువులకు అందజేయడానికి కేశవ్ (ప్రసన్న) భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటాడు. అయితే ‘ఆక్టోపస్’ను ప్రసన్న దక్కించుకోకుండా జై అడ్డుపడుతుంటాడు. ఇంతకీ ఈ ఆక్టోపస్ కథేంటీ? జై, కేశవ్‌లు ఎవరు? ఆక్టోపస్‌ను సొంతం చేసుకోవడానికి కేశవ్ ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? ఆక్టోపస్‌ను కాపాడటానికి జై ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనేది కథాంశం.

ఈ సినిమాకు తేజ్, మెహరిన్, ప్రసన్న ముగ్గురు మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఒక జవాన్ అంటే ఎలా వుండాలో తేజ్ అలా కనిపించాడు. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా తేజ్ క్యారెక్టర్ వుంటూనే.. ఒక బాధ్యతాయుతమైన లక్షణాలతో కొనసాగుతోంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రోడిగా తేజ్ బాగా చేసాడు. ఇప్పటివరకు సరదా సరదాగా కనిపించిన తేజ్.. ఈ సినిమాలో సరదాగా కనిపిస్తూనే.. కాస్త ఎమోషనల్‌గా కూడా ఆకట్టుకున్నాడు. నటుడిగా ఈ సినిమా తేజ్‌కు మరో మెట్టుకు ఎదిగేలా చేసిందని చెప్పుకోవచ్చు. లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ, యాక్షన్ ఎలిమెంట్స్‌లలో తేజ్ అదరగొట్టాడు. చాలా సెటిల్డ్‌గా జై పాత్రలో తేజ్ ఒదిగిపోయాడు. ఇక తేజ్‌కు పోటీగా నెగెటివ్ పాత్రలో తమిళ నటుడు ప్రసన్న బాగా చేసాడు. తేజ్, ప్రసన్నల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. ఇక ‘జవాన్’ సినిమాకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అంటే మెహరిన్ అని చెప్పుకోవచ్చు. పెయింటర్ భార్గవి పాత్రలో అదరగొట్టేసింది. మెహరిన్, తేజ్‌ల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక తేజ్ ఫ్యామిలీ మెంబర్స్‌గా నటించిన నటీనటులు, తదితరులు వారి వారి పాత్రలలో బాగా చేసారు.

ఇక సినిమా విషయానికొస్తే… ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదా సరదాగా కొనసాగుతూనే.. కొంచెం ఎమోషనల్ మూడ్‌ను క్రియేట్ చేస్తోంది. ఇండియన్ ఆర్మీ గర్వించదగ్గ ‘ఆక్టోపస్ మిసైల్ సిస్టమ్’ వెపన్‌ను కాపాడుకునే ప్రయత్నంలో తేజ్ ఏం చేసాడు? ఈ మిషన్‌లో భాగంగా తేజ్ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేవి థియేటర్లోనే చూస్తే బాగుంటుంది. కానీ ఇందులో థ్రిల్లింగ్, ఇంటలిజెన్స్, మైండ్ గేమ్ అంశాలు కొన్ని బాగున్నాయి. స్టోరీలైన్ ప్రకారం చూస్తే… దేశం కోసం తనవంతు సాయం చేద్దామనుకుంటే.. తన ఫ్యామిలీకి ఏదో ఒక సమస్యలు రావడం.. ఈ రెండింటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. అనే కాన్సెప్టుతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చినట్లుగానే అనిపిస్తాయి. కానీ దర్శకుడు బివిఎస్ రవి మాత్రం స్క్రీన్‌ప్లే పరంగా బాగా చూపించే ప్రయత్నం చేసాడు. మొత్తానికి సినిమా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు.

ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం బాగా హెల్ప్ అయ్యారు. ముఖ్యంగా కెవి గుహన్ సినిమాటోగ్రఫి అదిరిపోయింది. విజువల్స్ పరంగా సినిమా స్థాయిని పెంచేసాడు. కమర్షియల్ వాల్యూస్‌తో కూడిన అందమైన విజువల్స్‌ను అందించాడు గుహన్. ఇక థమన్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. పాటలు వినడానికే బాగుంటే.. విజువల్స్ పరంగా స్క్రీన్‌పై మరింత బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక శేఖర్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాత కృష్ణ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా రిచ్‌గా రూపొందించారు.

చివరగా… ‘జవాన్’ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని చెప్పుకోవచ్చు. యూత్‌, ఫ్యామిలీకి నచ్చే అంశాలతో పాటు కాస్త సమాజానికి సందేశం ఇచ్చే విధంగా ఇందులో కొన్ని అంశాలు వుండటం విశేషం.