బీఎస్పీతో జనసేన కొత్త పొత్తు..!

15 March, 2019 - 3:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లక్నో (ఉత్తరప్రదేశ్): ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పొత్తు పొడిచింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీఎస్పీతో కూడా కలిసి పోటీచేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఎన్నికల కోసం పవన్- మాయావతి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి జనసేన పోటీ చేస్తుందని గతంలో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. శుక్రవారంనాడు జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్‌తో కలిసి లక్నో వచ్చన పవన్‌ కల్యాణ్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయం పై ఆమెతో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పవన్‌ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.

భారత రాజ్యంగా నిర్మాత బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. దేశానికి దళిత ప్రధాని రావాల్సిన అవసరం ఉందని, మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని తాను, మాయావతి నిర్ణయించామని పవన్ ప్రకటించారు. బీఎస్పీకి ఎన్ని సీట్లు ఇచ్చేదీ త్వరలోనే ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.అనంతరం ఈ మీడియా సమావేశంలో మాయావతి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఆశయంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీపై అంగీకారం కుదిరిందని మాయావతి తెలిపారు. త్వరలోనే పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎంగా చూడాలని ఆమె అభిలషించారు.

కాగా.. పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఎన్నిసీట్లను బీఎస్పీకి కేటాయించిందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 32 మంది ఎమ్మెల్యేలు, నలుగురు లోక్‌సభ సభ్యులతో జనసేన పార్టీ తన తొలి జాబితాను గురువారమే ప్రకటించింది.

మొత్తం మీద జనసేన- బీఎస్పీ పొత్తు ఇరు తెలుగు రాష్ట్రాల్లోను మంచి ప్రభావమే చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాయావతితో భేటీతో దేశ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నట్లయింది.