బీఎస్పీకి ఇస్తున్న సీట్లు ఇవే

17 March, 2019 - 5:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: బీఎస్పీకి పొత్తులో భాగంగా 3 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆదివారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో బీఎస్పీ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్‌తో ఏపీలోని బీఎస్పీ నాయకులతో పవన్ పొత్తులపై చర్చలు జరిపారు.

అనంతరం వీర్ సింగ్‌తో కలసి పవన్ కళ్యాణ్ విలేకర్లతో మాట్లాడుతూ…. తిరుపతి, చిత్తూరు, బాపట్ల లోక్‌సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించినట్లు చెప్పారు. బీఎస్పీతో కలసి ప్రయాణం చేయడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గతంలో బీఎస్పీతో తనకు ఉన్న అనుబంధాన్ని పవన్ ఈ సందర్భంగా వివరించారు.

బీఎస్పీ అధినేత్రి మాయవతిని దేశ ప్రధానిగా చూడాలని కోట్లాది ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. అందులో తాను కూడా ఉన్నానని పవన్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే.. దళిత సీఎంని చేస్తామని గతంలో చెప్పారు… కానీ అది జరగలేదని.. అందుకు కారణం కూడా తనకు తెలియలేదన్నారు పవన్.

కానీ ఈ దేశానికి బలమైన నాయకురాలిగా మాయవతిని చూడాలని జనసేన పార్టీ కోరుకుంటుందన్నారు. తాజాగా లక్నోలో మాయవతితో భేటీ సందర్భంగా తమ మధ్య చర్చకు వచ్చిన పలు అంశాలను పవన్ వివరించారు. రానున్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో కలసి వెళ్తున్నట్లు పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.

అనంతరం బీఎస్పీ కీలక నాయకుడు,రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్ మాట్లాడుతూ… జనసేనతో పొత్తు కుదిరిన మార్చి 15వ తేదీ శుభ దినమని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేద్కర్ ఆశయసాధన కోసం మాయావతి పాటుపడుతున్నారని గుర్తు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో అదే విధమైన సామాజిక మార్పు దిశగా పవన్ కృషి చేస్తున్నారని వీర్ సింగ్ పేర్కొన్నారు. బీఎస్పీ నాయకుడు కాన్షీరాం భావజాలం పట్ల ప్రభావితుడైన నాయకుడు పవన్ అని చెప్పారు వీర్ సింగ్. పవన్ లాంటి నాయకుడు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.

బీఎస్పీ, జనసేన కలయిక ఓ మార్పునకు నాంది కావాలన్నారు. అందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కార్యకర్త కృషి చేయాలని వీర్ సింగ్ పిలుపు నిచ్చారు. అలాగే ఏప్రిల్ 3, 4 తేదీల్లో అమలాపురం, తిరుపతి, హైదరాబాద్‌లో జరిగే సభల్లో బీఎస్పీ అధినేత్రి మాయవతి పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధర్‌తోపాటు ఏపీలోని బీఎస్పీ నాయకులు ఆర్ జె. మల్లిక్, చిట్టిబాబు పాల్గొన్నారు.