దూసుకుపోతున్న ‘జనసేన’

01 April, 2018 - 3:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ముఖ్యమంత్రి పీఠం కాదు. ప్రజల సమస్యలే పరమావధి అనే ఫుల్ క్లారిటీతో దూసుకుపోతున్న నేత పవన్ కల్యాణ్. 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని స్థాపించినా… 2019లో తమ పార్టీ పోటీ చేస్తుందంటూ ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్. ఇటీవలే పార్టీ తొలి ఆవిర్భావ సభ జరిగింది. ఆ సభ అనంతరం పవన్ తన స్పీడ్‌‌ను మరింతగా పెంచారు. అందులో భాగంగా పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో జనసైన్యం పేరుతో ఆ పార్టీ ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌‌లో వెల్లడించారు. ఇప్పటికే 17 లక్షల మందికి పైగా యువతీ యువకులు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు తీసుకున్నారని వివరించారు.
నిజాయితీ రాజకీయాలతో పటిష్టమైన పౌర సమాజం నిర్మించేందుకు జనసేన కట్టుబడి ఉందని జనసేన ప్రతినిధులు స్పష్టం చేశారు. పార్టీ దార్శనికతను విశ్వసించే ప్రతి ఒక్కరినీ సభ్యులుగా చేర్చుకుంటామని తెలిపారు.

జనసేన ఆవిర్భావ మహాసభ నుంచి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన కొద్ది రోజుల వ్యవధిలో 10 లక్షల మంది మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం తీసుకున్నారని పార్టీ ప్రతినిధులు వివరించారు. పార్టీలో చేరిన వారిలో అత్యధికులు యువతే అని వారు పేర్కొన్నారు. అంతే కాకుండా పార్టీలో చేరిన వారిలో 40 శాతం మంది జనసేన పార్టీకీ వలంటీర్లుగా సేవ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. అయితే మిస్డ్ కాల్ ఇవ్వలేని వారు, అధునాతన ఫోన్ ద్వారా సభ్యత్వ కార్డు తీసుకోలేని వారిని పార్టీలో సభ్యులుగా వలంటీర్లు ద్వారా చేర్పించేందుకు అనుగుణంగా యాప్ సిద్ధం చేస్తామని వారు వివరించారు.

ఈ ప్రక్రియ చాలా సులువు అవుతుందన్నారు. 9394022222కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు సభ్యత్వ నమోదు కావచ్చునన్నారు. పార్టీలో సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా యాప్‌‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 14వ తేదీన జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ మహా సభలో మిస్ట్ కాల్‌‌తో పార్టీ సభ్యులుగా చేరవచ్చు అని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.