‘రోడ్లపైకి వచ్చేందుకు పవన్ కల్యాణ్ సిద్ధం’

10 October, 2019 - 4:12 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా 26 డిమాండ్లపై తెలంగాణ సర్కార్ ఏమాత్రం స్పందించకపోవడంతో.. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ నిర్వహించేందుకు కూడా వారు సిద్ధమవుతున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ నేత శేఖర్‌గౌడ్ తెలిపారు. జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ పార్టీ సహకారం అందిస్తుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల తరపున ఉద్యమించడానికి, రోడ్ల మీదకు రావడానికి తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.మరో పక్కన తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల తొలగింపు నిర్ణయం ఆందోళనకరమని పవన్ కల్యాణ్ అన్నారు. కార్మికులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే కానీ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియా వేదిక ట్విటర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో కార్మికులు సమ్మె చేపట్టిన సందర్భంగా 1200 మందిని తప్ప మిగతా వారందర్నీ తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురిచేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన సకల జనుల సమ్మెలో 17 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేసి, ఉద్యమానికి అండగా ఉన్నారు. వారి త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అటు ప్రభుత్వం.. ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఉద్యోగుల పట్ల ఉదారత చూపి ఆర్టీసీ సమ్మెనె సామరస్యంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.