పవన్ పర్యటన ఇలా….

14 February, 2020 - 7:09 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఫిబ్రవరి 15వ తేదీ అంటే శనివారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9.00 గంటలకు పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభమవుతోంది. రాజధాని పరిధిలోని పలు గ్రామాల మీదగా పవన్ పర్యటన కొనసాగుతోంది.

అందులోభాగంగా  రైతులు, మహిళలతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పవన్ ఎర్రబాలెం చేరుకుంటారు. అక్కడి నుంచి మందడం, వెలగపూడి, రాయపూడి మీదగా తుళ్లూరు, అక్కడి నుంచి అనంతవరం చేరుకుంటారు. అలాగే దీక్షా శిబిరాల్లోని ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపనున్నారు.

ఇక 16వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గంటలకు జనసేనాని పవన్ రేపల్లె నియోజకవర్గంలోని జనసేన పార్టీ శ్రేణులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.00 గంటలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని జనసేన పార్టీ శ్రేణులతో పవన్ సమావేశం కానున్నారు. అనంతరం పార్టీలోని కొందరు ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఆ తర్వాత మూడు గంటలకు జనసేన లీగల్ విభాగం సమావేశంలో పవన్ పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. దీంతో ఇప్పటికే గత టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని అని ప్రకటించి.. అందుకోసం రైతుల నుంచి భూములు సైతం సేకరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటనతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ క్రమంలో రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత 58 రోజులగా.. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు.

అంతేకాదు వైయస్ జగన్ ప్రభుత్వ ప్రకటనతో పలువురు రైతులు సైతం గుండెపోటుతో మరణించారు. అయినా ఇంకా ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి పవన్ కళ్యాణ్.. అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అయితే జనవరిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి పరిసర ప్రాంత రైతులు, ప్రజలు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలను నిలవరించేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

దీంతో అమరావతి పరిసర ప్రాంత రైతులు, ప్రజలు గాయపడ్డిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రైతులు, ప్రజలు .. జనసేనాని పవన్‌ను కలిసి.. మరోసారి అమరావతి ప్రాంతంలో పర్యటించాలని కోరారు. అందుకు పవన్ సానుకూలంగా స్పందించారు. వారికిచ్చిన మాటకు కట్టుబడి జనసేనాని పవన్ మరోసారి అంటే శనివారం అమరావతిలో పర్యటించనున్నారు.