సింధు పట్టుదల యువతకు స్ఫూర్తి

25 August, 2019 - 9:17 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్‌షిప్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి, చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ తరఫున, తన తరఫున ఆయన సింధును అభినందించారు. బ్యాడ్మింటన్ విజేతగా నిలిచి దేశమంతా గర్వించేలా సింధు చేసిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఇప్పటి వరకూ మన దేశానికి దక్కని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను మన తెలుగుతేజం సింధు సాధించినందుకు ప్రతి ఒక్కరం గర్వపడాలంటూ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ పోటీల్లో 2017, 18 సీజన్లలో తుది పోటీలో నెగ్గుకురాలేకపోయినా పట్టుదలతో మూడోసారి జయకేతనం ఎగరేసిన సింధు అద్వితీయ పోరాటపటిమ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందంటూ పవన్ వ్యాఖ్యానించారు.