ముద్ర కనబరిచిన ‘గీతాంజలి’  

31 October, 2019 - 4:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ప్రఖ్యాత నటి గీతాంజలి మరణం బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. గీతాంజలి ఆత్మకు శాంతి కలగాలని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్‌లోని సీనియర్ నటుల్లో గీతాంజలి ఒకరని ఆయన పేర్కొన్నారు. గీతాంజలి పేరు చెప్పగానే ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలోని శ్రీసీతారాముల కళ్యాణము చూతము రారండి… పాటలో సీతాదేవి గుర్తుకు వస్తుందని పవన్ చెప్పారు.

తెలుగుతోపాటు పలు భాషా చిత్రాల్లో ఆమె నటించారని… వివిధ చిత్రాల్లో పలు వినోద ప్రధానమైన పాత్రల్లో నటించిన గీతాంజలి .. తనదైన ముద్రను కనబరిచారని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే  చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఆ తర్వాత ఇరు కుటుంబాలు హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఆ అనుబంధం కొనసాగిందని పవన్ తెలిపారు. గీతాంజలి మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున, తన తరఫున  పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానూభూమి తెలిపారు.