‘జంబ లకిడి పంబ’ సినిమా రివ్యూ ..!

22 June, 2018 - 2:59 PM

సినిమా: జంబ లకిడి పంబ
జానర్: కామెడీ ఎంటర్‌‌టైనర్‌
సంగీతం: గోపి సుందర్‌
దర్శకత్వం: జేబీ మురళీకృష్ణ
బ్యాన‌ర్‌: శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌‌లైన్ ప్రొడ‌క్షన్స్
నిర్మాత: ఎన్‌. శ్రీనివాస్‌‌రెడ్డి, రవి, జోజో జోస్‌
నటీనటులు: శ్రీనివాస్‌‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రితేజ‌, రాజ్యల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, జ‌బ‌ర్దస్త్ అప్పారావు, జ‌బ‌ర్దస్త్ ఫ‌ణి త‌దిత‌రులు.

‘గీతాంజలి`, `జ‌య‌మ్ము నిశ్చయ‌మ్మురా` లాంటి వైవిధ్యమైన చిత్రల త‌ర్వాత శ్రీనివాస‌రెడ్డి న‌టించిన చిత్రం `జంబ‌ ల‌కిడి పంబ‌`. ప్రేక్షకుల ముందుకు శుక్రవారం ఈ సినిమా వ‌చ్చింది. ఒకప్పటి హిట్ చిత్రం `జంబ‌ ల‌కిడి పంబ‌`ను ప్రేక్షకులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఈవీవీ చేసిన మాయ అలాంటిది. అలాంటి మేజిక్‌‌ను ఇప్పుడు కమెడియన్‌‌గా కొనసాగుతూనే హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీనివాస్‌‌రెడ్డి హీరోగా తెరకెక్కిన ఈ మోడ్రన్ జంబ లకిడి పంబ ద్వారా రీ క్రియేట్ చేశారా? చూద్దాం..

స్టోరీ: వ‌రుణ్ (శ్రీనివాస‌రెడ్డి) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. గ్రామపెద్ద కుమారుడు అత‌ను. ఫ్యాషన్ డిజైనర్ ప‌ల్లవి (సిద్ధి ఇద్నానీ)ని ప్రేమిస్తాడు. వారి పెళ్లికి పెద్దలు అంగీక‌రించ‌రు. దాంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వివాహం చేసుకుంటారు. అయితే ఆ తరువాత వారి మధ్య చిన్న చిన్న పొర‌పొచ్చాలు వ‌స్తాయి. దాంతో లాయ‌ర్ హ‌రిశ్చంద్రప్రసాద్ (పోసాని)ని ఆశ్రయిస్తారు. హరిశ్చంద్రప్రసాద్ అప్పటికే 99 విడాకులు ఇప్పించి ఉంటాడు. వీరిది 100వ విడాకుల కేసు.

ఈ నేప‌థ్యంలో హ‌రిశ్చంద్రప్రసాద్ ప్రమాదంలో మరణిస్తతాడు. ఆత్మగా య‌మ‌పురికి వెళ్లిన అత‌నికి ఓ వింత స‌మ‌స్య ఎదుర‌వుతుంది. త‌న స‌మ‌స్య ప‌రిష్కర‌ణ‌లో భాగంగా అత‌ను వ‌రుణ్‌, ప‌ల్లవి ఆత్మల‌ను మారుస్తాడు. అక్కడి నుంచి ఏమైంది? శ‌రీరం ఒక‌టి, ఆత్మ మ‌రొక‌టిగా ఆ దంప‌తులు ఎదుర్కొన్న స‌మ‌స్యలు ఏంటి? మ‌ర‌లా మామూలుగా మార‌డానికి హ‌రిశ్చంద్ర ప్రసాద్ చెప్పిన స‌ల‌హా ఏంటి? చివ‌రికి భార్యాభ‌ర్త ఒక‌ట‌య్యారా లేదా? ఇలావ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.

విశ్లేష‌ణ‌:
చీటికీ మాటికీ గొడ‌వ‌లు ప‌డే దంప‌తులు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్న మాట నిజ‌మే. అలాగే కొంత‌మంది స్వార్థప‌రులైన న్యాయ‌వాదులు దీన్నే అవ‌కాశంగా భావించి డ‌బ్బు సంపాదించ‌డానికే మొగ్గుచూపుతుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా లాక్కొస్తుంటారు. ఇంతా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఒక్క క్షణం ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచిస్తే అంతా అదే స‌ర్దుకుంటుంది అని చెప్పే సినిమా జంబ లకిడి పంబ. అయితే లైన్‌‌గా విన‌డానికి బాగుంది కానీ.. దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ప్రేక్షకుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి. పాట‌లు కూడా మెప్పించ‌వు. ఒక‌రి మీద ఒక‌రు ప‌గ ప‌ట్టడం, ఒక‌రి కెరీర్‌ను మ‌రొక‌రు నాశ‌నం చేసుకోవాల‌నుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌న్నీ తేలిపోయాయి. ఎక్కడా డెప్త్ క‌నిపించ‌లేదు. ఇద్దరిలోనూ ఉన్న క‌సి క‌నిపించ‌దు. అమ్మాయి ల‌క్షణాల‌తో శ్రీనివాస‌రెడ్డి, అబ్బాయి ల‌క్షణాల‌తో సిద్ధి ఇద్నానీ బాగా న‌టించారు.
స‌త్యం రాజేశ్ ప్రవ‌ర్తించే విధానం స‌హ‌జంగా ఉంటుంది. హ‌రితేజ పాత్ర బాగుంది. వెన్నెల కిశోర్ త‌న ప‌రిధిలో బాగా న‌టించారు. చాలా సంద‌ర్భాల్లో కామెడీ న‌వ్వించ‌లేక‌పోయింది. పాట‌లు ఎప్పుడొస్తాయో, ఎందుకొస్తాయో అన్నట్టు ఉన్నాయి. అమ్మాయిల స‌మ‌స్యల గురించి మాట్లాడేట‌ప్పుడు సున్నితంగా, హ‌ద్దు మీర‌కుండా తెర‌కెక్కించిన విధానం బాగుంది. మ‌లుపులు, కొత్తద‌నం ఏమీ లేక‌పోవ‌డంతో ప్రేక్షకులు బోర్ ఫీల‌వుతారు. జంబ లకిడి పంబ లాంటి క్లాసిక్‌‌ను టచ్‌ చేసే ధైర్యం చేసిన దర్శకుడు మురళీకృష్ణ ఆ స్థాయిలో అలరించటంలో ఫెయిల్‌ అయ్యారు. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌‌లో హీరో హీరోయిన్ల మధ్య జరిగే గొడవలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా టీవీ సీరియల్‌‌లా సాగటం ప్రేక్షకులను విసిగిస్తుంది. కామెడీ సినిమా అనుకొని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు హర్రర్‌ కామెడీ, ఎమోషనల్‌ డ్రామాలను చూపించటం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. హీరో హీరోయిన్ల శరీరాలు మారిన తరువాత కూడా కథనం ఆసక్తికరంగా సాగలేదు.
అబ్బాయిల బాధలను అమ్మాయిలకి, అమ్మాయిల బాధలేంటో అబ్బాయిలకు తెలియాలనే ఆలోచనతోనే దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. కాన్సెప్ట్‌ వరకు బాగానే ఉన్నా..తాను అనుకున్న విషయాన్ని తెరపైకి తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యాడు. కేవలం దేహాలు మారడం వల్ల జరిగే పరిణామాలు, దాన్నుంచి పుట్టే వినోదంపై దృష్టిపెట్టాడు దర్శకుడు. గోపి సుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అనవసర సన్నివేశాలకు కత్తెర వేస్తే సినిమా కాస్త ఆసక్తికరంగా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్లు:
శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని న‌ట‌న‌
కాన్సెప్ట్‌
నేప‌థ్య సంగీతం
అక్కడక్కడా హాస్యం
కెమెరా
మైన‌స్ పాయింట్లు:
పేలవమైన క‌థ‌నం
ట్విస్టులు లేక‌పోవ‌డం
ఆక‌ట్టుకునేలా లేని పాటలు
సాగ‌దీసినట్లు అనిపించడం