బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనదే!

30 October, 2017 - 9:08 PM

♦ మీడియా పల్స్

తాత్విక శూన్యంలో తెలుగు జర్నలిజం – ఇదీ విద్వాన్ విశ్వం జయంతి సభలో చర్చ నీయాంశం. అక్టోబర్ 21న శ్రీ పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి ఆకాశవాణి సంయుక్తంగా తిరుపతిలో నిర్వహించిన సదస్సులో పాత్రికేయులు, విశ్రాంత సంపాదకులు టంకశాల అశోక్ సంధించిన నిశితమైన ప్రశ్న ఇది. ఇటీవల ఒక మహిళా జర్నలిస్టు నేటి జర్నలిజం పోకడలపై ఒక వెబ్‌సైట్‌లో వ్యాఖ్యానిస్తూ, వెలికి రాకుండా అణగదొక్కబడేది జర్నలిజం, మిగతా అంతా ప్రచారం మాత్రమే అని అభిప్రాయపడ్డారు.

ఈ మాట గురించి కూడా చాలాసేపు ఆలోచించవలసి వచ్చింది. నేడు వైరుధ్యాల అంతరం, తీవ్రతా, అంతకు మించి వాటి ప్రభావం చాలా పెరిగాయి. సంఘర్షణ కూడా అంతే స్థాయిలో తీవ్రమైంది. నిజానికి ఇప్పుడే జర్నలిజం అవసరం మరింత పెరిగింది. పెరిగింది అంటే అసలైన సిసలైన జర్నలిజం పోషించాల్సిన పాత్ర విపరీతంగా పెరిగిందని చెప్పడం. కానీ నేడు మీడియా అనేది కేవలం అధికారం, పదవి, ధనం, రాజకీయం గల వర్గాల వారిలో అంతర్భాగంగా మారిపోతోందనేది ప్రధాన విమర్శ.

కవి, కాలమిస్టు, రచయిత, అనువాదకుడు, పాత్రికేయుడు, సంపాదకుడుగా రాణించిన విద్వాన్ విశ్వం (1915- 1987) తిరుపతిలో చదువుకోవడమే కాదు, చివరి రోజుల్లో అక్కడే ఉద్యోగం చేశారు. అక్కడే గతించారు. శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో మూడున్నర దశాబ్దాల క్రితం గెస్ట్ లెక్చరర్‌గా ఎంఎ విద్యార్ధులకు తెలుగు జర్నలిజం పేపరు బోధించారని అప్పటి విద్యార్ధి, ఇప్పటి వైస్ ఛాన్సలర్ ఆచార్య వి. దుర్గాభవాని ఒక నెల కిత్రం మాటల మధ్య చెప్పారు. అదే సమయంలో నేను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ విద్యార్ధిగా ఉంటూ వైయుక్తికమైన ఆసక్తితో విద్వాన్ విశ్వం గారిని కలిశాను. మా రాత పత్రికకు వారిని అప్పట్లో ఇంటర్వ్యూ కూడా చేశాను.

విద్వాన్ విశ్వం

ఏడేళ్ల క్రితం సాహిత్య అకాడెమీ కోసం విద్వాన్‌ విశ్వం గారి  మీద నేను మోనోగ్రాఫ్ రాయడం ఒక ఆనందం. ఈ నేపధ్యంలో విశ్వం గారితో మా అనుబంధాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి ఆకాశవాణి సంయుక్తంగా ఒక సదస్సు నిర్వహించాం.  ఇందులో వార్త దినపత్రిక విశ్రాంత సంపాదకులు అశోక్ గారి ప్రసంగంతో పాటు విశ్వం గారి కావ్యం ‘పెన్నేటి పాట’ గానం కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం శ్రీ పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయంలో అక్టోబర్ 21వ తేదీ ఉదయం రెండు గంటల పాటు జరిగింది.

ప్రజల వైపు నుంచి, మేధావుల నుంచి జర్నలిజం సమాజానిదనీ, దానిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత తమదేననీ ప్రయత్నం బయలుదేరితే ఫలితం తప్పక ఉంటుంది. ఎవరు..? ఎక్కడ..? ఎలా..? అనేదే ప్రధానం!!

సదస్సు తర్వాత కూడా అశోక్ గారితో తెలుగు జర్నలిజం గురించి ఆకాశవాణి పరిచయం కోసం లోతుగా చర్చించాను. జర్నలిజం తీరుతెన్నుల మీద నిరంతరం స్పందిస్తున్న పాత్రికేయుడు ఆయన. ఒక సంద ర్భంలో ‘వార్త’ పత్రికలో ఈ అంశంపై అయిదు భాగాల విశ్లేషణ రాసినట్లు గుర్తు. ఇటీవలి కాలంలో కూడా రాస్తున్నారు. అయితే అవి తెలంగాణా ఎడిషన్లలోనే రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో మావంటి వారు క్రమం తప్పకుండా చదవలేక పోతున్నారు. జర్నలిజం బాగోగుల గురించి వారు వార్త దినపత్రికలో చర్చా వేదిక నిర్వహించారు. చాలమంది పాల్గొన్న ఆ అభిప్రాయ వేదిక వార్త సంపాదక పుటలో ధారావాహికంగా సాగింది. ఈ అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించి ఒక సంకలనం వంటిది ప్రచురించాలని అప్పట్లో నాకు ఒక ఆలోచన కూడా వచ్చింది.

అశోక్ గారి ప్రకారం ప్రజాస్వామ్యం నాలుగు అంగాలలో ఫోర్త్ ఎస్టేట్ పూర్తిగా ప్రజలకు సంబంధించినది! ప్రజల కోసం పని చేసేది!! ప్రజల సొత్తు!! కనుక జర్నలిజాన్ని సమాజం పరికించాలి; పరిశీలించాలి; పరిరక్షించాలి. తాత్విక శూన్యంలో తెలుగు జర్నలిజం అంటే, విలువలు పూర్తిగా పడిపోవడమే కాదు; జర్నలిజం చేయాల్సిన పని కాకుండా మరేదో చేస్తున్నది. అందువల్లనే అంత తీవ్రమైన మాటను ఆయన వాడారు. విశ్వం జయంతి మరుసటి రోజున చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాలను పరిశీలించాం. అక్కడ దాదాపు మొత్తం సమాజం జర్నలిజపు ఆషాడభూతుల నిర్వాకాలను దూషించింది. మమ్ములను కూడా సూటిగా ప్రశ్నించారు.

ప్రశ్న కన్నా ప్రక్షాళన ప్రధానం. అదే విషయం టంకశాల వారితో అన్నాను. తెలుగు ప్రాంతంలో పొత్తూరి వెంకటేశ్వర రావు, వరదాచారి, రాఘవాచారి, తుర్లపాటి కుటుంబరావు వంటి పత్రికా ఉద్దండులూ, ఉభయ రాష్ట్రాలలో ప్రెస్ అకాడెమీలూ, జర్నలిస్టు సంఘాలూ, వివిధ వర్గాల సంఘాలూ కలిసి మిడియాను పరిశీలించి, సూచనలూ, సలహాలు అభినందనలూ అందిచవచ్చు. దీనికి కేవలం హైదరాబాద్, విజయవాడలోనే కాక జిల్లా స్థాయిలో రీడర్స్ / వ్యూయర్స్ క్లబ్బులు ఏర్పడాలి. ఘర్షణాయుతంగా కాకుండా సామరస్యంతో ప్రయత్నించవచ్చు. ఒక ఆరు నెలలు ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని అశోక్ భావన. సమాజంలో ఆడపిల్లల స్థితి గురించి సిఎంఎస్ సంస్థ యునెస్కో కోసం కొన్ని సంవత్సరాలుగా పోటీలు నిర్వహిస్తోంది. బహుమతులు ఇస్తోంది. ఇప్పుడు తెలుగు టెలివిజన్‌లో ఇలాంటి సెన్సిటివిటీ మెరుగయింది. ఇది నా స్వయం పరిశీలన. కనుక ప్రజల వైపు నుంచి, మేధావుల నుంచి జర్నలిజం సమాజానిదనీ, దానిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత తమదేననీ ప్రయత్నం బయలుదేరితే ఫలితం తప్పక ఉంటుంది. ఎవరు..? ఎక్కడ..? ఎలా..? అనేదే ప్రధానం!!

  • నాగసూరి వేణుగోపాల్
    మీడియా విశ్లేషకులు