కార్తీచిదంబరం ఇంటిపై ఈడీ దాడులు

13 January, 2018 - 11:49 AM

                                                            (న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: తమిళనాడులో ఈడీ దాడులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబం కార్యాలయంపై శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కార్తి చిదంబరం మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే..ఈ కేసులో ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. మొత్తం అయిదు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. చెన్నైలో నాలుగు ప్రాంతాల్లో, ఢిల్లీలో మరో చోట తనిఖీలు చేపడుతున్నారు.

గత ఏడాది ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ దర్యాప్తులో భాగంగా కార్తి చిదంబరంపై మనీల్యాండరింగ్ కేసు నమోదు అయ్యింది. డిసెంబర్ 1న కూడా కార్తికి చెందిన ఆస్తులపై చెన్నైతో పాటు కోల్‌కతాలోనూ దాడులు జరిగాయి. గత సెప్టెంబర్‌లో కార్తికి చెందిన సుమారు కోటిన్నర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మాక్సిస్ గ్రూపుకు అనుమతులు ఇప్పించినందుకు కార్తితో పాటు చిదంబరం మేనల్లుడు పలనియప్పన్‌కు సుమారు రెండు లక్షల డాలర్లు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.