ఇస్రో అంటేనే కొత్త ఆవిష్కరణలకు కేంద్రం

12 January, 2018 - 11:53 AM

(న్యూవేవ్స్ డెస్క్)

నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ40 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ-సీ40ని విజయవంతంగా ప్రయోగించి, 31 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురుస్తున్నాయి. పీఎస్ఎల్వీ-సీ40 ప్రయోగం విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్‌లు అభినందనలు తెలిపారు.

పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ, కార్టోశాట్-2 విజయవంతం దేశానికి బహుమతి అని చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇస్రో అంటేనే కొత్త ఆవిష్కరణలకు కేంద్రమని అన్నారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలను చేపట్టబోతున్నామని చెప్పారు. చంద్రయాన్-2, జీఎస్ఎల్వీ మార్క్-2 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, అద్భుతమైన విజయంతో కొత్త ఛైర్మన్‌కు స్వాగతం పలికామని చెప్పారు.

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ 40రాకెట్ ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ-సీ40 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. తనతోపాటు 31 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. వీటిలో మూడు భారత ఉపగ్రహాలు ఉండగా మిగిలినని విదేశాలకు చెందిన నానో ఉపగ్రహాలు. భారత ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 ఈఆర్ ఉంది. ఈ ఉపగ్రహం సహాయంతో తుపాన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 1323 కిలోల బరువును ఉపగ్రహవాహక నౌక తనతో పాటు తీసుకెళ్లింది. కార్టోశాట్-2 ఉపగ్రహం బరువు 710 కిలోలు. ఈ ప్రయోగంతో వంద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకుంది.