చెలరేగిపోతున్న ‘శంకర్’

19 July, 2019 - 5:49 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఐ స్మార్ట్ శంకర్. ఈ చిత్రం విడుదలైన తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 16 కోట్లు రాబట్టింది. ఈ మేరకు ఈ చిత్రాన్ని నిర్మించిన పూరీ కనెక్ట్స్ శుక్రవారం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్… ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర దర్శకుడు, నిర్మాతల్లో ఒకరైన పూరీ జగన్నాథ్‌ను తనదైన శైలిలో పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రియమైన పూరీ జగన్నాథ్ గారు.. సినిమా నచ్చితే పొగుడుతాం…. నచ్చకపోతే తిడతాం… కానీ ఏంటండి.. మిమ్మల్ని మాత్రం బూతులతో పొగడాలని ఉంది…. మీరంతా నాపై చూపిన ప్రేమకు థ్యాంక్స్ .. అది ఇప్పుడు స్క్రీన్‌పై ప్రతిబింబిస్తోందని  పేర్కొన్నారు.

ఐ స్మార్ట్ శంకర్ చిత్రం జులై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చగా… పూరీ జగన్నాథ్, ప్రముఖ నటి ఛార్మీ నిర్మాతలుగా వ్యవహరించారు. రామ్ తన సినిమాల్లో ఇదే హైయస్ట్ ఒపెనింగ్ అని సిని విశ్లేషకులు పేర్కొంటున్నారు.