తెలుగు సినిమాలో దళితుల చోటెక్కడ?

19 September, 2017 - 5:34 PM

బాహుబలి దర్శకుడు రాజమౌళికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డు అందిస్తున్న సందర్భంగా మొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీలు పడి ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వండర్ రాజమౌళి అన్నారు. బాహుబలి మొదటి సినిమా విడుదల నుంచే ఈ ధోరణి మొదలయింది.

బాహుబలి గానీ, ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి గానీ నిజంగా ఈ ప్రశంసలకు అర్హులా కాదా అన్న చర్చకు కాదు ఈ రాత. ఆ తరహా చర్చకు నోచుకునే స్థాయి కూడా బాహుబలికి లేదు. ఎంత పనికి మాలిన ఫార్మూలా సినిమాలో నైనా ఎవో కొన్ని విలువలు ఉంటాయి. బాహుబలిలో ఏదీ లేదు. ఆ సినిమా ఎందుకు తీసిందీ రాజమౌళే చెప్పాలి. అయితే తెలుగు సినిమాను ఒక్కసారి పరికించి చూసేందుకు ఇది తగిన సందర్భం.

తెలుగు ప్రజల జీవితంలో సినిమాకున్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వారు సినిమా తింటారు, తాగుతారు, శ్వాసిస్తారు. జీవితాలతో ఇంతగా పెనవేసుకుపోయిన మరో కళారంగం లేదు. మరి ఇంత ముఖ్యమైన సినిమా పరిస్థితి ఎలా ఉంది? సమాజం నడకలో విడదీయరాని భాగంగా మారిన ఈ రంగం సమాజం మంచిచెడుల మొత్తానికీ ప్రతిబింబంగా ఉందా? సమాజం పోకడలను మన సినిమాల్లో చూడగలుగుతున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాదు, లేదు అని తేలిగ్గానే జవాబు చెప్పవచ్చు.

తెలుగు సమాజం ఏనాడూ జడంగా లేదు. మార్పు కోసం సామాజిక సంఘర్షణ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంది. వాటికి తెలుగు సినిమాలో ఏనాడూ చోటు దొరకలేదు. ఉన్నత కులాలుగా గుర్తింపు ఉన్న కులాల విలువలకే చోటు దొరికింది. అదే కొనసాగుతోంది. దళితుల సమస్యలను మెయిన్‌స్ట్రీమ్ సినిమా స్పృశించింది లేదు. తెలుగు సినిమా బహుజనులను ఆమడ దూరంలో ఉంచిందని చెప్పొచ్చు.

దాదాపు 50 ఏళ్ల క్రితం కృష్ణాజిల్లా, కంచికచర్లలో కోటేశు అనే దళితుడిని సజీవ దహనం చేశారు. ఆ సంఘటన రాష్ట్రంలో తీవ్రమైన సంచలనం కలిగించింది. ఆ తర్వాత 15 ఏళ్లకు చిత్తూరు జిల్లా, పాదిరికుప్పంలో ముగ్గురు దళితులను చంపారు. కొందరు దళిత మహిళలపై అత్యాచారం జరిపారు. తర్వాత రెండేళ్లకు 1985లో కారంచేడు దారుణం సంభవించింది. 1991లో చుండూరు మారణకాండ చోటుచేసుకున్నది. పైన చెప్పిన సంఘటనలన్నిటిలో బాధితులు దళితులే. దాడులు చేసిన వారు అగ్రవర్ణాల వారే. వీటిలో కారంచేడు, చుండూరు ఘటనలు జాతీయస్థాయిలో సంచలనాలయ్యాయి. ఈ మారణకాండ దళితులలో, ప్రజాస్వామిక వాదుల్లో పెద్ద స్థాయి చర్చను మధనాన్ని లేవనెత్తింది. దళిత స్పృహతో సాహితీ సృజన వెల్లువెత్తింది. ఈ సంఘటనలు తెలుగు సమాజంలో మొత్తంగా తెచ్చిన మార్పు విప్లవాత్మకమైనది.

ఇంకాస్త సమీప గతంలోకి చూస్తే మాదిగ దండోరా ఉద్యమం కనబడుతుంది. ఎస్‌సి రిజర్వేషన్‌లో మాదిగలకు వేరుగా కోటా ఉండాలంటూ మంద కృష్ణమాదిగ నిర్మించిన ఉద్యమం గొప్ప ఉద్యమాల కోవలోకే వస్తుంది. అన్ని రాజకీయపార్టీలూ ఆమోదిస్తున్నప్పటికీ మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగా మాదిగల డిమాండ్ అమలు కావడం లేదు. తరచి చూస్తే ఈ వివాదంలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో దశాబ్దాల పాటు అమలవుతూ వస్తున్న రిజర్వేషన్ల ఫలితాలు, ఎస్‌సిలలోని భిన్న కులాలలో అవి తెచ్చిన మార్పులు, వ్యత్యాసాలు, సమాజం మొత్తం మీద రిజర్వేషన్ల ప్రభావం, రాజకీయపార్టీల దివాళాకోరు వోటు బ్యాంకు రాజకీయాల వంటి చాలా ముఖ్యమైన అంశాలు ఇందులో కనబడతాయి.

ముందు ప్రస్తావించుకున్న దళిత స్పృహ, దండోరా ఉద్యమం, సంబంధిత పరిణామాలు తెలుగు సినిమాను ఏమాత్రం కదిలించలేక పోయాయి. ఒక సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన పరిణామాలు అదే సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్న కళారంగాన్ని అంటలేకపోవడం ఎంత విషాదం!

పోనీ అందరూ మాట్లాడే అంటరానితనం నిర్మూలన కథావస్తువుగా సినిమాలు వచ్చాయా? తెలుగు రాష్ట్రాలలోని కొన్ని గ్రామాలలో అమానుషమైన రెండు కప్పుల పద్ధతిని అమలు చేస్తున్న సంగతి మీడియాలో చాలాసార్లు వచ్చింది. తెలుగు సినిమాను మాత్రం ఈ వార్తలు కదిలించలేక పోయాయి. నిజానికి ఈ విషయంలో గతమే ఘనమైనది. అస్పృశ్యత కథావస్తువుగా ఎప్పుడో 1938లోనే గూడవల్లి రామబ్రహ్మంగారు మాలపిల్ల సినిమా తీశారు. ఆ తర్వాత కులాంతర వివాహాల గురించి మళ్లీ చర్చించింది 1975 నాటి బలిపీఠం సినిమాలో. రంగనాయకమ్మ నవల ఆధారంగా దాసరి నారాయణరావు తీసిన ఈ సినిమాలో కూడా అగ్రవర్ణ కధానాయిక ప్రేమించి పెళ్లి చేసుకుంది లేదు. కథానాయిక చివరి కోరిక తీర్చడం కోసమే దళిత హీరో ఆమెను పెళ్లి చేసుకుంటాడు.

1988లో బాలచందర్ తీసిన రుద్రవీణలో సవర్ణ కథానాయకుడికీ దళిత కథానాయికకూ మధ్య ప్రేమ నడుస్తుంది. ఇందులో కూడా కులం ప్రధాన ఇతివృత్తం అని చెప్పలేం. మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలలో కులవివక్ష ప్రస్థావన కనబడుతుంది కానీ అదే ప్రధాన ఇతివృత్తంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అగ్ర హీరోలు దళితుల పాత్రలు పోషించిన సందర్భాలు దాదాపు మృగ్యం. కులాంతర వివాహాల సినిమాల్లో చూసినా హీరోయినే దళితకులం నుంచి వస్తుంది. హీరోది మాత్రం అగ్రవర్ణమే. తెలుగు సినిమాలో బలంగా వేళ్లూనుకు పోయిన హీరోస్వామ్యం తప్ప ఇందుకు మరో కారణం కనబడదు. బలిపీఠం, స్వయంకృషి లాంటి కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు.

కొంత కాలంగా అగ్రహీరోల సినిమాలలో కొత్త పోకడ కనబడుతోంది. హీరో పాత్రకు హీరో కులాన్ని సూచించే పేరు పెడుతున్నారు. హీరోల మధ్య పోటీకి కులం కూడా తోడు కావడంతో ఈ జాడ్యం మొదలయింది. వంశాల గొప్పతనం గురించి కూడా ప్రేక్షకుల నుంచి చప్పట్లు ఆశించే డైలాగులు రాయిస్తున్నారు. దళిత కులాల నుంచి సినీ పరిశ్రమలోకి కధానాయకులు ఇప్పట్లో వస్తారని ఆశించలేం. ఉన్నది ప్రధానంగా అగ్రవర్ణాల హీరోలే. కులాలు కథలో భాగమయినప్పుడు అగ్రవర్ణాల హీరోలు ధరించే పాత్రలకు కులాలను సూచించే పేర్లు ఉండొచ్చునేమో గానీ, మసాలా ఫార్ములా సినిమాలో అలా ఉండడం ఏ విధంగా సబబు?
ఈ అగ్రవర్ణాల హీరోలు భౌతిక శాస్త్ర నియమాలకు అతీతంగా బలప్రదర్శన చేస్తూ ఉంటారు. చర్మం కనీసం చిట్లకుండా ఉక్కునీ గ్రానైట్ రాళ్లనూ పిండి చేస్తుంటారు. వీరి కన్నా రెండు మూడు రెట్లు బలిష్టంగా కనబడే దుష్టుల ముఠా సభ్యులను చితకబాదుతుంటారు. ఎప్పటికప్పుడు హీరో చేతిలో నుగ్గునుగ్గు అయ్యే ఆ బ్యాచ్ అంతా నల్లగానే ఉంటారు. వారు ఎవరని మనం అనుకోవాలి? ఒక మోస్తరుగా ఉండే అగ్రవర్ణ కధానాయకుడు (పేరుని బట్టి అంతే అనుకోవాలిగా) ఉక్కుమనిషిగా బలప్రదర్శన చేయడం, నిజంగా ఉక్కు మనిషిలా కనబడే దళితుడు (రంగును బట్టి అంతే అనుకోవాలి మరి) ఆ కథానాయకుడి చేతిలో చిత్తు కావడం తెలుగు సినిమా మార్కు సామాజిక న్యాయం.

రాజమౌళి సినిమా బాహుబలిలో కాలకేయుడు అనే క్యారెక్టర్ కారునలుపుతో కనబడతాడు. ప్రపంచంలో ఎక్కడా లేని ఓ భాష మాట్లాడతాడు. నీతినియమాలు లేని క్రూరుడు అతను. అతని అనుచరులంతా కూడా నల్లవాళ్లే. సినిమాలో మిగతా వాళ్లంతా బంగారు మేని ఛాయ మనుషులు. కాలకేయుడు, అతని జనం ఎవరని మనం అనుకోవాలి? ఎవరని మనం అనుకోవాలని రాజమౌళి ఉద్దేశం?

కళ అంతిమ లక్ష్యం సమాజ శ్రేయస్సా లేక కళ కళ కోసమేనా అన్న వివాదాన్ని తెంచడానికి ప్రయత్నించక్కర లేదు గానీ అటయినా ఇటయినా దానిని సినిమాకు అంత తేలిగ్గా అన్వయించలేం. అన్వయించనివ్వరు. కోట్లు కోట్లు డబ్బు పోసి సినిమాలు తీసేది ఎంతోకొంత లాభం కళ్లచూసేందుకే తప్ప సమాజం కోసమో కళ కోసమో కాదని కుండ బద్దలు కొట్టేవారు కాస్త ఎక్కువమందే ఉంటారు. దానితో ఎవరికీ పేచీ ఉండక్కర లేదు. సినిమాలు తీసేవాళ్లు తమతమ ఇష్టాల ప్రకారం సినిమాలు తీసుకుంటారు. జాషువా లాంటి గొప్ప కవి జీవితాన్ని సినిమాగా తీయాలన్న ఆలోచన బాక్సాఫీసు దర్శకులకు రావాలని ఏముంది. మరీ అంత చప్పిడి కథనా, కుట్రలు కుతంత్రాలు తేకపోతే సినిమా ఏముంది అనేవాళ్లకు కన్నమదాసు లాంటి వీరుడి చుట్టూ పల్నాటి యుద్ధం కథను తిప్పుతూ ఓ చిత్రం తీయవచ్చని చెప్పవచ్చు. అందులో ఆనాడే చాపకూడు లాంటి ప్రయోగాలు చేసిన బ్రహ్మనాయుడి లాంటి సంస్కరణాభిలాషులు ఉంటారని కూడా చెప్పవచ్చు. కానీ బాహుబలి లాంటి రంగు రుచి వాసన లేని సినిమాకు జాతీయస్థాయి ఉత్తమ చిత్రం అవార్డు లభించినందుకు పండుగ చేసుకున్న తెలుగు సినీ పరిశ్రమకు ఇట్లాంటి సలహాలు ఇచ్చే అవకాశం ఉందా? స్పీల్‌బర్గ్‌, కప్పోలా లాంటి దర్శకులు రాజమౌళి ముందు తీసికట్టు అనే స్థాయిలో ఏక కంఠంతో నినదిస్తున్న తెలుగు చలనచిత్ర రంగం బహుజనుల కథల జోలికి వెళ్లగలదా!

పెద్ద దర్శకులపై ఆశలు పెట్టుకోనక్కర లేదు గానీ చిన్న సినిమా తీసేవాళ్లను ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం కూడా తెలుగు పరిశ్రమలో లేదు. పరిశ్రమ అంతా ఏకపక్షంగా నడుస్తోంది. బడాబాబులు పరిశ్రమను శాసిస్తున్నారు. అన్నిటికన్నా ఘోరం ఏమంటే తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లు ముగ్గురు నలుగురు పెద్దల చేతుల్లో ఉండడం. కష్టపడి సినిమా తీయడం ఒక ఎత్తు, దానిని ప్రదర్శించేందుకు ధియేటర్లు సంపాదించడం ఒక ఎత్తుగా మారింది. చిన్న సినిమాలు అయినప్పటికీ జనం నోళ్లలో నానిన సినిమాలే తీసిన ఆర్. నారాయణమూర్తి లాటి నిర్మాతలకే దిక్కు లేకుండా పోయిన తర్వాత చిన్న నిర్మాతలు సినిమా తీసే సాహసం చేయగలరా? సినిమా కూడా వ్యాపారమే అని వక్కాణించే వాళ్లు గుర్తు పెట్టుకోవాలిన విషయం ఏమంటే ఏ వ్యాపారంలోనయినా గుత్తాధిపత్యం ఉండకూడదు. అది చట్టానికి కూడా విరుద్ధం. అలాంటి లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉన్నపుడు దళితులకు, బహుజనులకు కూడా తెలుగు సినిమాలో భాగస్వామ్యం దొరకవచ్చు.

– ఆలపాటి సురేశ్ కుమార్‌