భీమవరంలో పవన్ బలమెంత?

17 April, 2019 - 3:15 PM

             (న్యూవేవ్స్ డెస్క్)

సినీ నటుడిగా సంపాదించుకున్న అభిమాన ధనం, యువతలో మంచి క్రేజ్, ఎలాంటి అవినీతి మరకా అంటని క్లీన్ చిట్ ఉన్న నేత.. ఆయన నిక్కచ్చితనం, సమస్యలపై పోరాడే తత్వం.. ఇవన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉన్న ప్లస్ పాయింట్లు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన పవన్ కల్యాణ్ అటు విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానంలో, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాసనసభా సెగ్మెంట్‌లోనూ తన బలం ఏంటో నిరూపించుకునేందుకు బరిలో దిగారు.

అయితే.. భీమవరం అసెంబ్లీ స్థానంలో పవన్ కల్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తారు? సెగ్మెంట్‌లో ఆయనకు ఉన్న బలమెంత? విజయం సాధిస్తారా? సాధిస్తే.. మెజారిటీ ఎంత రావచ్చు.. అనే అంశాలపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానం చర్చ జరుగుతోంది.

2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఇచ్చిన ఒక్క పిలుపుతో ఏనాడూ పోలింగ్ బూత్ ముఖం కూడా చూడని యువకులెందరో క్యూల్లో నిలబడి మరీ ఓట్లు వేశారన్నది జగమెరిగిన సత్యం. అప్పుడు పవన్ పిలుపు కారణంగానే కనీసం 3 శాతం అధికంగా ఓట్లు పడ్డాయంటారు. పవన్ ఫ్యాక్టర్‌తోనే ఆనాడు టీడీపీ బతికి బట్టకట్టి తక్కువ మెజారిటీ ఓట్లతో అయినా అధికార పీఠాన్ని ఎక్కిందనేది కాదనలేని వాస్తవం.

అలాంటి పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ఈసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగడం అటు టీడీపీ ఇటు వైఎస్సార్సీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. టీడీపీ పార్టనర్ అని వైఎస్సార్సీపీ నేతలు ఒక పక్కన ఆరోపిస్తుంటే.. వారికి వంత పాడిన చందంగా టీడీపీ నేతలు కూడా పవన్‌పై మరింత అనుమానం కలిగేలా మాట్లాడి జనాన్ని మరింత అయోమయానికి గురిచేశారు. ఏదైతేనేం చివరికి అటు టీడీపీతో కానీ, ఇటు వైఎస్సార్సీపీతో కానీ సంబంధం పెట్టుకోకుండా ముందు నుంచీ ఆయన చెబుతున్నట్లు లెఫ్ట్ పార్టీలతోనూ మరో పక్కన బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచారు.ఈ క్రమంలో పవన్ కల్యాణ్ భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి స్వయంగా పోటీలో నిలిచారు. దీంతో భీమవరం ఎన్నికల్లో మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి. నిజానికి ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) బలమైన పోటీదారు అనేది పలువురు చెబుతున్న మాట. అంజిబాబు రెండు సార్లు ఇక్కడి నుంచే గెలవడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా.. 2014లో టీడీపీ క్యాండిడేట్‌గా ఆయన గెలిచారు. భీమవరం సెగ్మెంట్‌లో 65 వేల కాపు సామాజికవర్గం ఓట్లున్నాయి. పైపెచ్చు మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన స్వయాన వియ్యంకుడు కూడా.

ఇక వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కూడా కాపు సామాజికవర్గం వారే. 2009లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్‌ను క్షత్రియులు పంతం పట్టి ఓడించి, అంజిబాబును నెగ్గించడం గమనార్హం. అంజిబాబు దూకుడు స్వభావి అనే పేరుంది. సౌమ్యుడిగా ముద్రపడిన గ్రంథి శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచీ నియోజకవర్గంలో పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వచ్చారని చెబుతారు. తన పార్టీ అధికారంలో లేకపోయినా సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ప్రజలకు చేరువయ్యేందుకు కృషిచేశారంటారు.

కాగా.. తాను ఏ సామాజికవర్గానికీ చెందని వాడినని చెప్పినప్పటికీ పవన్ కల్యాణ్ కూడా కాపు సామాజికవర్గం వ్యక్తే. అంటే.. ఇప్పుడు భీమవరం బరిలో ప్రధాన పార్టీ అభ్యర్థులుగా ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు నిలబడ్డారు.

అటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే అంజిబాబును, ఇటు శ్రీనివాస్‌ను తట్టుకుని పవన్ కల్యాణ్ భీమవరం ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారా? అనే చర్చ స్థానికంగా పెద్ద ఎత్తున జరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో పవన్ విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం.

నిజానికి భీమవరం నియోజకవర్గంలో కాపులు-క్షత్రియుల మధ్య జాతి వైరం ఎప్పటి నుంచో ఉంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో క్షత్రియులంతా ఏకమై అంజిబాబును భారీ మెజారిటీతో గెలిపించారు. అప్పుడు గ్రంథి శ్రీనివాస్‌ ఓటమి పాలయ్యారు. ఈ సారి మాత్రం క్షత్రియులంతా ఐక్యమై ఒకే పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నారని, ఆ క్రమంలో ఎన్నికలకు రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానంటూ ముందు వచ్చిన పవన్ కల్యాణ్ పట్ల మొగ్గు చూపినట్లు గుసగుసలు వినిపించాయి. రెండుసార్లు గెలిపించినప్పటికీ అంజిబాబు ఏదైనా వివాదం వచ్చినప్పుడు తమకు బాసటగా నిలవలేదనే అక్కసు క్షత్రియుల్లో ఉందంటారు. గ్రంథి శ్రీనివాస్‌ను గతంలో ఓడించిన క్షత్రియులు మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. యువతలో, మహిళల్లో మంచి క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్‌కు ఈ సారి కాపు సామాజికవర్గం ఓట్లతో పాటు క్షత్రియుల ఓట్లు కూడా భారీగా పడ్డాయని, వీటితో పాటు బీసీలు కూడా పవన్‌కు మద్దతుగా నిలిచారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరో పక్కన స్థానిక సమస్యల్ని పవన్ కల్యాణ్ బాగా అడ్రస్ చేశారు. ముఖ్యంగా భీమవరం డంపింగ్ యార్డ్ సమస్యను పవన్ కల్యాణ్ బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ పవన్ మాట ఇచ్చిన తీరు కూడా పట్టణ ప్రజలను బాగా ఆకట్టుకుంది. దశాబ్దాలుగా భీమవరం పట్టణ ప్రజలను ఇబ్బంది పెడుతున్న యనమదుర్రు డ్రైన్ సమస్య పైన కూడా పవన్ దృష్టి సారించడం ఆయనకు కలిసి వచ్చే అంశం అంటున్నారు. వీటితో పాటు వివిధ సామాజికవర్గాలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా పలువురితో పవన్ విడివిడిగా సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి పనిచేస్తానని చెప్పడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. పైగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోరాట యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్ ఎక్కువ రోజులు భీమవరంలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించడం, ప్రతి ఒక్కరినీ కలవడం వల్ల కూడా ఆయనకు పెద్ద ఎత్తున ఓట్లు పోలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఓట్లు వేసి తమ ప్రతినిధిగా అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకుని, గాజు గ్లాస్ గుర్తు మీద వేశారని స్థానికంగా జరుగుతున్న చర్చ.

ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలతో పాటు భీమవరంలో కూడా క్రాస్ ఓటింగ్ బగా జరిగిందని స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఈ క్రాసం ఓటింగ్‌లో పవన్ కల్యాణ్‌కు, ఎంపీ టీడీపీ అభ్యర్థి శివ, వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు, కాంగ్రెస్ పార్టీ తరఫున కనుమూరి బాపిరాజు (క్షత్రియులే) మధ్య ఓట్లు చీలి పడ్డాయంటున్నారు. ఇలా చూసుకున్నా.. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి విజయం సాధించడం తథ్యమనే అభిప్రాయాలు స్థానికంగా వస్తుండడం విశేషం.

ఓట్ల లెక్కింపునకు చాలా రోజులు గడువు ఉంది. గత ఐదేళ్ళుగా తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు తనను గెలిపిస్తాయని అంజిబాబు ధీమా ఉన్నారంటున్నారు. జగన్ నాయకత్వాన్ని రాష్ట్రప్రజలు కోరుకుంటున్నారని, నియోజకవర్గంలో సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించిన తానే విజయం సాధిస్తానంటూ గ్రంథి శ్రీనివాస్ ధీమా ఉన్నారట! అయితే.. ఆ రెండు పార్టీల్ని నమ్మే స్థితి లేదని, రాష్ట్రంలో కొత్త నాయకత్వం రావాలని ఓటర్లు కోరుకుంటున్నారని, జనసేనే గెలుస్తుందని జనసైనికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం త్రిముఖ పోటీలో విజయం పవన్ కల్యాణ్‌ను వరిస్తుందా? లేదా స్పష్టం కావాలంటే మే నెల 23న ఫలితాలు వెల్లడయ్యే వరకూ వేచి ఉండక తప్పదు మరి..!