పవన్ కింగ్ మేకర్ కానున్నారా?

30 May, 2018 - 5:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే.. అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి గత మూడు నాలుగు నెలలుగా ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తుండగా మరో వైపు జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గత తొమ్మిది పది రోజులుగా ప్రజా పోరాట యాత్ర సాగిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో మూడు రోజుల పాటు హడావుడి చేసిన విషయం తెలిసిందే. దీంతో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరాన్ని ప్రారంభించినట్లయింది. అయితే ఈ త్రిముఖ పోరులో విజేతగా నిలిచేదెవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి పట్టం కట్టేది ఎవరికి? అనే విశ్లేషణలు కూడా ఇప్పుడే మొదలైపోయాయి.

దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక మాదిరిగా ఉన్నట్లు కొంత మంది విశ్లేషిస్తున్నారు. కర్ణాటకలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడం.. బీజేపీ, కాంగ్రెస్ కన్నా చాలా తక్కువ సీట్లు సాధించిన జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఏపీలో కూడా 2019 ఎన్నికల్లో దాదాపు ఇదే తరహా ఫలితాలు వస్తాయా? కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్లుగా ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ కానున్నారా? అంటే సగటు ఓటరు నుంచి అవుననే సమాధానమే వస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత (యాంటీ ఇంకంబెన్సీ) కొంత ప్రతికూలంగా మారుతుంది. కానీ ఈ యాంటీ ఇంకంబెన్సీ అనేది టీడీపీపై మరింత ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీఏతో నాలుగేళ్లు సహవాసం చేసి, ఏడాదిలో ఎన్నికలు రానున్న దృష్ట్యా తన చేతగానితనాన్ని కప్పుపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగడం, అమరావతి గురించి తప్ప రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల గురించి పట్టించుకోకపోవడం, టీడీపీ పాలనలోని అవినీతే ఇందుకు కారణాలు.ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికల మాదిరిగా 2019లో స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు బీజేపీతో పాటు పవన్ కల్యాణ్ కూడా మద్దతు ఇవ్వడంతో టీడీసీ సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (88) కన్నా 15 సీట్లు ఎక్కువే సాధించింది. కానీ ఇప్పుడు బీజేపీతో గానీ పవన్ కల్యాణ్‌తో గానీ కలిసి పోటీ చేసే అవకాశాలు టీడీపీకి లేవు. అందువల్ల టీడీపీ ఒంటరిగా నెగ్గుకు రావడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు.
దీనికి తోడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యలపైన పోరాడుతోంది. నిజానికి 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడికి ఉన్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మద్దతిచ్చారు. ఆయన అనుభవం కొత్త రాష్ట్రానికి లాభిస్తుందని ఆశించారు.

కానీ.. టీడీపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ అంచనాలకు అనుగుణంగా సమర్థవంతంగా పాలన సాగించలేకపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయింది. ఉద్దానంలోని కిడ్నీ వ్యాధుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు గ్రామస్థుల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గోదావరి ఆక్వా పార్కుపైన, గంగవరం పోర్టు బాధితుల తరఫున జనసేన గళం విప్పింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కల్పించిన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలను ధ్రువీకరించడానికి జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటుచేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల లెక్కలు తేల్చింది.
జనసేన పోరాట యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్ క్రమక్రమంగా ప్రజా సమస్యలపైన అవగాహన పెంచుకుంటూ, వాటిని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా విఫలం అయ్యాయో వివరిస్తున్నారు. సినిమాల వల్ల వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్, చిన్నప్పటి నుంచీ పెంపొందించుకున్న సామాజిక సృహ, వ్యక్తిత్వం పరంగా ఉన్న క్లీన్ ఇమేజ్, ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల, పోరాడే తత్వం తదితర లక్షణాలు పవన్ కల్యాణ్‌కు ప్రజా నాయకుడిగా రాణించడంలో కలిసిరానున్న అంశాలని చెప్పొచ్చు.దీనికి తోడు సామాజిక సమీకరణలు బలమైన ప్రభావం చూపే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్‌కి ఆయన సామాజికవర్గం నుంచి వంద శాతం మద్దతు ఉండే అవకాశం ఎలాగూ తప్పదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాలు పవన్‌కు వెన్నంటి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర సమస్యలపై సాధికారికంగా స్పందిస్తున్న పవన్ కల్యాణ్ ఆయా సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటికే పోరాటయాత్ర శ్రీకాకుళం జిల్లాలో సాగించారు. గురువారం నుంచి విజయనగరం జిల్లాలో పోరాట ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో మొత్తం 45 రోజుల పాటు పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ఉత్తరాంధ్ర నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఈసారి జగన్ ఒక్కరికే సొంతం కాదనేది అంశం స్పష్టం అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత పవన్ కల్యాణ్‌కూ కలిసి వచ్చే అంశం అవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చారనే అభిమానం ఆయా పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరుల్లో ఎలాగూ ఉంటుంది. అది కూడా పవన్ కల్యాణ్‌కి ప్లస్ పాయింటే.

ఇకపోతే.. మరో నాలుగు జిల్లాలు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురంలతో కూడిన రాయలసీమలో సహజంగానే వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం ఉంటుంది. ఇది గత ఎన్నికల్లోనూ కనిపించింది. కాకపోతే జగన్‌పై కేసు విచారణలు కొనసాగుతున్నందున ఆయనకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత స్థాయిలో సీట్లు రాకపోవచ్చే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీకి కూడా అదే పరిస్థితి తప్పదంటున్నారు. వీటన్నింటి దృష్ట్యా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ కర్ణాటకలోని జేడీ(ఎస్) మాదిరిగా చక్రం తిప్పనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.