పవన్ పాలిటిక్స్ తప్పా.. రైటా?!

03 June, 2019 - 4:51 AM

యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధ తంత్రాన్ని అనుసరించాలనేది నాటి రాజనీతి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎత్తుకు పైఎత్తులే వేయాలనేది నేటి రాజకీయ నీతి. ఈ సూత్రాలను పాటించిన వారికే విజయం దక్కుతుంది. అలా కాకుండా మరో మార్గంలో వెళ్తామంటే వర్తమాన రాజనీతి కాలంలో కుదరదంటే కుదరదేమో మరి…! నీతివంతమైన రాజకీయాలు తీసుకువస్తానంటూ జనసేన పార్టీతో ప్రజల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్‌ ఇప్పుడలాంటి పరిస్థితినే చవిచూడాల్సి వచ్చిందనేది వాస్తవం.

నీతివంతమైన రాజకీయం అంటూ వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఓటమి అనే చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఎంతటి శక్తి అయినా.. ఆయన పట్ల జనంలో ఎంతటి ఆకర్షణ, నమ్మకం ఉన్నా.. ఇంతకు ముందెవరూ అంతగా పట్టించుకోని అత్యంత క్లిష్ట సమస్యలపై స్పందించినా.. ఓటింగ్ సమయంలో నీతివంతంగా ఆలోచించి, ఓట్లు వేసే ప్రజానీకం ఇప్పుడు లేరనేది సుస్పష్టం. రాజకీయం చేసేటప్పుడు రాజకీయంగా వెళ్ళాలనే సూత్రాన్ని ఇంతకు ముందు చెప్పింది అందుకే..

అయితే.. పాతిక కేజీల బియ్యం కాదు.. పాతికేళ్ళ భవిష్యత్తు ఇస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌ను స్వయంగా ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడించారు ప్రజలు. పాతికేళ్ళ భవిష్యత్ సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఈ రోజు ఓటుకు ఏ పార్టీ ఎంత డబ్బించ్చిందనే తాత్కాలిక ప్రయోజనం మీదే జనం దృష్టి కేంద్రీకృతమైందనే చెప్పాలి. వాళ్ళెంతిచ్చారు… వీళ్లేమి ఇచ్చారనే దానిపైనే ఓటర్ల చూపు ఉందనేది వాస్తవం.జనసేన పార్టీకి సీట్లు కాదు.. రాజకీయాల్లో మార్పు ఎంతవరకూ తీసుకు రాగలమన్న పవన్ మాటల్ని ఓసారి మననం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క సీటు వచ్చినా రాకపోయినా ప్రజల కోసమే తాను పనిచేస్తానని ఆయన అన్న మాటలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. ఓట్ల కోసం నోట్లు ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ పార్టీకి 6.8 శాతంతో మొత్తం 21 లక్షల 30 వేల 367 మంది ఓట్లు వేశారు. అంటే.. ఇతర పార్టీలకు పడిన ఓట్లలో అధిక శాతం ప్రలోభాలకు గురై వేసినవనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్న విషయం గమనార్హ. అంటే.. జనసేన అభ్యర్థులకు పడిన ఓట్లన్నీ పవన్ కల్యాన్ చెప్పినట్లు నీతివంతమైన రాజకీయాన్ని కోరుకుంటూ.. ఎలాంటి ప్రలోభాలకూ గురికాకుండా వేసిన ‘ఉచిత ఓట్ల’ని చెప్పక తప్పదు. అంటే ఇన్ని లక్షల మందిలో పవన్ కల్యాణ్ మార్పు మంత్రం పనిచేసిందనేది సుస్పష్టం.

నిజానికి ఒక పార్టీ ఓట్ల కోసం డబ్బులిచ్చినప్పుడు లేదా ఇతర ప్రలోభాలు పెట్టినప్పుడు మరో పార్టీ ఎందుకు ఇవ్వదంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తప్ప ఇతర ప్రధాన పార్టీల అధినేతలు, నేతలు కూడా ‘ఓట్ల కోసం ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి.. ఓట్లు మాత్రం మా పార్టీకే వేయండ’ని చెప్పిన సందర్భాల్ని మనం ప్రస్తావించుకోవాలిక్కడ. ఓటు వేసేందుకు ఆ ఒక్క రోజు కోసం నోట్లు తీసుకున్న ఓటరు తమ ప్రతినిధిని మరో ఐదేళ్ళ పాటు నిలదీసే అర్హతను కోల్పోతాడనే సత్యాన్ని ఎందుకు గుర్తుంచుకోడనేది ఆందోళన కలిగించే అంశం.

ఓట్ల కోసం డబ్బులు, తాయిలాలు ఇవ్వని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను, విశాఖపట్నం పార్లమెంటరీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ లాంటి వారికి ఓట్లు వేయని వారిప్పుడు పునరాలోచనలో పడుతున్న వైనాలు అక్కడక్కడా కనిపిస్తుండడం గమనార్హం. నిజాయితీపరులను చట్టసభలకు పంపించకపోవడం తప్పు అనే భావనలు ఇప్పుడు పలువురి నుంచి వ్యక్తం అవుతుండడం గమనార్హం. ఓడినా, నెగ్గినా ప్రజల్లోనే, ప్రజల మధ్యనే ఉంటున్న, సామాజిక కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తున్న లక్ష్మీనారాయణను చూసిన ప్రతి ఒక్కరూ ఔరా! అంటున్నారు. జీరో బడ్జెట్‌తో ఎన్నికలకు వెళ్ళామని జనసేన అభ్యర్థులు సగర్వంగా తలెత్తుకుని చెప్పుకుంటున్నారంటే.. నీతివంతమైన రాజకీయం అన్న పవన్ కల్యాణ్ కల.. కోరిక చాలా వరకూ నెరవేరినట్లే అనక తప్పదు.నిజానికి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగి 21 లక్షలకు పైబడి ఓట్లు సాధించడం అంటే.. అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే.. పవన్ కల్యాణ్ ఈ విషయంలో సఫలీకృతుడయ్యారనే చెప్పాలి. తొలిసారి ఎదురైన ఓటమి అంటే.. వాస్తవానికి ఓటమే కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. తొలి ఓటమి ఒక గుణపాఠం అవుతుందని, భవిష్యత్తులో ప్రజలతో మరింత బాగా మమేకం కావడానికి, జనం సమస్యల పరిష్కారానికి దీటైన పోరాటం చేయడానికి జనసేన పార్టీకి లభించిన చక్కని అవకాశం అనే భావించాలి. ఇప్పుడు జనసేన సాధించిన ఓట్ల సంఖ్య భవిష్యత్ ఎన్నికల్లో మరింత పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేయడంలో తప్పు లేదు.

చివరిలో ఓ మాట.. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక పవన్ కల్యాణ్ నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో జనసేన పార్టీలోని అధికశాతం అభ్యర్థులు చెప్పిన మాట ఒక్కటే.. అది జీరో బడ్జెట్‌తో ఎన్నికల్లో పాల్గొన్నామని. భవిష్యత్తులో అయినా.. మొత్తం అన్ని పార్టీలూ, అందరు అభ్యర్థులూ ఇలాగే జీరో బడ్జెట్‌తో ఎన్నికలకు వెళ్తే.. పవన్ కల్యాణ్ చెబుతున్న మాట సఫలమైనట్టే.. స్వచ్ఛందంగా, బాధ్యతతో, ఓటు వేసిన ప్రతి ఓటరుకూ తమ సమస్యలపై ప్రజాప్రతినిధులను ప్రశ్నించే బ్రహ్మాస్త్రం చేతికి వచ్చినట్టే…

డి.వి. రాధాకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్