ఇంతకీ.. కింగా.. కింగ్ మేకరా..?

06 March, 2018 - 5:00 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ ఇలా ప్రకటన చేశారు.. అలా రంగంలోకి దిగిపోయారు. ఈ థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ క్రమంలో దేశంలోని మిగతా 28 రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల కీలక నేతలతో భేటీ కానున్నారు. అలాగే అఖిల భారత సర్వీస్‌‌కు చెందిన మాజీ అధికారులతో పాటు త్రివిధ దళాలకు చెందిన మాజీ అధికారులతో కూడా కేసీఆర్ సమావేశమై చర్చలు జరపనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలపండిన రాజకీయ మేధావుల అనుభవాలతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా కేసీఆర్ వారితో మాట్లాడనున్నారు.

అయితే అంతా బాగానే ఉంది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో 21 రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. మరి కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుని పాలన సాగిస్తోంది. మరీ ఈ గులాబీ బాస్… దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ నేతలను ఏకం చేసి.. కింగ్‌‌గా ఉంటారా? లేక ప్రధాని పదవికి మరో అభ్యర్థి పేరు ప్రకటించి.. కింగ్ మేకర్‌‌గా మిగిలిపోతారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది.

1990 దశకంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అప్పటి ఎన్డీఏ కన్వీనర్‌‌గా చంద్రబాబు కీలక భూమిక పోషించారు. ఆ క్రమంలో ఆయనకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని పలువురు జాతీయ నేతలు సూచించారు. కానీ తనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ముఖ్యమని.. ఆ రాష్ట్రానికి సీఎంగా ఉండటమే ఇష్టమని… ఈ నేపథ్యంలో ప్రధాని పదవిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు చంద్రబాబు చెప్పుకుంటారు.

దీంతో 1997లో చంద్రబాబు కింగ్‌‌గా కాకుండా కింగ్ మేకర్‌‌గా మారిన సంగతి తెలిసిందే. మరీ కేసీఆర్ కూడా చంద్రబాబునే ఫాలో అవుతారా? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆశలు.. ఆకాంక్షల కోసం టీఆర్ఎస్ పార్టీ స్థాపించానంటూ పేర్కొంటారు కేసీఆర్. అంతేకాకుండా ఉద్యమ సమయంలో తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించారు. కానీ తెలంగాణ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. దీంతో కేసీఆర్‌‌పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. ఈ నేపథ్యంలో దీనిపై కేసీఆర్ స్పందిస్తూ… ఇష్టపడి.. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరొకరి చేతుల్లో పెట్టడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. అందుకే తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినట్లు కేసీఆర్ వివరించారు. మరీ కేసీఆర్ థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కింగ్‌‌గా మారి హస్తినలో చక్రం తిప్పుతారా? లేకుంటే తెలంగాణ సీఎంగా ఆయనే ఉండి… దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీకి చెందిన కీలక నేతను ప్రధాని పీఠంపై కూర్చో పెట్టి కింగ్ మేకర్‌‌గా మారతారా? అనేది మాత్రం కాలమే తేల్చాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.