పవన్‌ దెబ్బకు.. బాబు హడల్..?

06 April, 2018 - 5:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీ మళ్లీ గెలిచి.. తాపే సీఎం పీఠం ఎక్కే చాన్సులు ఉన్నాయో లేదో అనే అనుమానం చంద్రబాబు బుర్రలో పెనుభూతమైనట్లుగా కనిపిస్తోంది. మరొకరెవరో పోరాటం చేస్తే.. ఆ క్రెడిట్ అంతా వారికే దక్కి… ఫలితంగా ఓట్లన్నీ గంపగుత్తగా వారి పార్టీకే పడిపోయి ఆ నాయకుడెవరో సీఎం సీటు ఎక్కేస్తే.. మన పని హుష్‌కాకి అయిపోతుందేమో అని బాబు భయపడుతున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్నిపవన్ చేతుల మీదగా ఆవిష్కరించారు. దీనికీ పోటీగా అధికార టీడీపీ రంగంలోకి దిగి.. శ్రీధర్ వర్మ రాసిన ‘ప్రజా రాజధానిపై కుట్ర – దుష్టచతుష్టయం’ పుస్తకాన్ని అదే సమయంలో విజయవాడలోనే టీడీపీ నేత వర్ల రామయ్య ఆవిష్కరించారు. అలాగే ఏప్రిల్ 6వ తేదీన ఏపీపై మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్షాలతో కలసి విజయవాడలో పాదయాత్ర చేస్తానని పవన్ ప్రకటించారు. దీంతో రాత్రికి రాత్రే అధికార టీడీపీ పథక రచన చేసేసింది. అదే రోజు ఇదే అంశంపై సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు అప్పటికప్పుడు ప్రకటించింది. దీంతో సీఎం చంద్రబాబు… మంత్రి లోకేష్‌బాబు ఇతర టీడీపీ నాయకులు అంతా సైకిల్ ఎక్కి మరీ యాత్ర చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పలు సెటైర్లు హల్ చల్ చేస్తున్నాయి.అధికార టీడీపీ సాగిస్తున్నఈ తతంగమంతా చూస్తే.. పవన్‌‌ జోరుతో చంద్రబాబుకు ఏదో భయం ఆవరించినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేకపోతే పుస్తకావిస్కరణలకు, పాదయాత్రలకు పోటాపోటీ ఏమిటన్నది వారి ప్రశ్న. అదీకాక ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేస్తున్న నిరసన కార్యక్రమాలు కూడా ప్రజల్లో నవ్వుల పాలయ్యాయి. సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన కూడా అలాగే ప్రహసనంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ పర్యటనతో బాబు ఏం సాధించారనేది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు.

అంతే కాకుండా… ఢిల్లీలో మన ఎంపీలు చేస్తున్న పోరాటం ప్రజల్లోకి బాగా వెళ్తుందంటూ చంద్రబాబు కితాబు ఇవ్వడం చూస్తే… ఆయనకు ఆయనే శభాష్ అని భుజం చరుచుకున్నట్లుగా ఉందని సోషల్ మీడియాలో సైటర్ల పర్వం కొనసాగుతోంది.